Let's talk: editor@tmv.in
డిజిటల్‌ డిపాజిట్ల మోసం ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌

డిజిటల్‌ డిపాజిట్ల మోసం ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌

Gaddamidi Naveen
7 జనవరి, 2026

దాదాపు 4,000 మందికి పైగా డిపాజిటర్లను రూ.792 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు అనధికారికంగా డిపాజిట్లు సేకరించి, నమ్మకద్రోహం, మోసం, క్రిమినల్ కుట్రలకు పాల్పడినట్లుగా నమోదైంది.

క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఈ మోసాలకు పాల్పడిందని సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ చారు సిన్హా తెలిపారు. లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇరాన్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ముంబై విమానాశ్రయంలో అమర్‌దీప్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ అడిషనల్ డీజీ చారు సిన్హా వెల్లడించారు. ప్రస్తుతం ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

నకిలీ వెబ్‌సైట్‌, యాప్‌లతో మోసాలు

నిందితులు నకిలీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ రూపొందించి, ప్రముఖ బహుళజాతి సంస్థల పేర్లతో తప్పుడు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఒప్పందాలు సృష్టించారు. అధిక వడ్డీ రాబడుల వాగ్దానంతో ప్రజలను ఆకర్షించి భారీగా డిపాజిట్లు చేయించారు. మొత్తం 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లను సేకరించగా, అందులో 4,065 మంది బాధితులకు రూ.792 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.

బాధితుల ఫిర్యాదుల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈకనామిక్ ఆఫెన్సెస్ వింగ్‌లో కేసులు నమోదు చేసి, వాటిని తెలంగాణ సీఐడీకి బదిలీ చేశారు. భారతీయ న్యాయ సంహిత నిబంధనలు, అలాగే తెలంగాణ రాష్ట్ర డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, 1999 కింద కేసులు నమోదు చేశారు.

ఇప్పటివరకు డైరెక్టర్లు, కీలక ఉద్యోగులు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సహా మొత్తం 11 మందిని అరెస్టు చేసి న్యాయ కస్టడీకి పంపించారు. దర్యాప్తులో భాగంగా 12 ప్లాట్లు, నాలుగు లగ్జరీ కార్లు, రూ.8 లక్షల నగదు, 21 తులాల బంగారం, అలాగే రూ.8 కోట్ల బ్యాంక్ నిల్వలను గుర్తించి అటాచ్‌మెంట్ ప్రక్రియ చేపట్టారు.

2021 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ కొత్త పెట్టుబడిదారుల డబ్బుతో పాత పెట్టుబడిదారులకు రాబడులు చెల్లిస్తూ పోంజీ స్కీమ్ నిర్వహించింది. సేకరించిన నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి, క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫారమ్‌లు, ఐటీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, మల్టీ లెవల్ మార్కెటింగ్, లగ్జరీ హాస్పిటాలిటీ, ప్రైవేట్ చార్టర్ సేవలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసం వినియోగించారు. 2025 జనవరి 15 నాటికి ఈ స్కీమ్ కుప్పకూలి, రాబడులు ఆగిపోవడంతో హైదరాబాద్ కార్యాలయం మూసివేయబడింది. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం నిధుల మార్గాన్ని గుర్తించేందుకు సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

డిజిటల్‌ డిపాజిట్ల మోసం ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌ - Tholi Paluku