Let's talk: editor@tmv.in
డిజిటల్ జనగణనకు రాష్ట్రపతి శ్రీకారం
డిజిటల్ జనగణనకు రాష్ట్రపతి శ్రీకారం

డిజిటల్ జనగణనకు రాష్ట్రపతి శ్రీకారం

Pinjari Chand
2 ఏప్రిల్, 2026

దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న 2027 జనగణన ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వీయ వివరాలను (సెల్ఫ్ ఎన్యూమరేషన్) గణన ప్రక్రియలో నమోదు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్ము ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌ఈ పోర్టల్ (se.census.gov.in) ద్వారా తన కుటుంబ వివరాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్, భారత జనగణన కమిషనర్ మృత్యుంజయ్‌ కుమార్‌‌ నారాయణ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే పోర్టల్‌లో తన వివరాలను నమోదు చేశారు. ఈ రోజు నుంచి 2027 జనగణన తొలి దశ ప్రారంభమైంది. ఇది దేశంలో తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంలో డేటా సేకరణ జరుగుతున్న జనగణన. ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అందరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఆన్‌లైన్‌లో ఫారం నింపారు. ఈ ప్రక్రియ ప్రభుత్వ పథకాలు ప్రతి పౌరుడికి సమర్థంగా చేరేందుకు ఉపయోగపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 16 నుంచి ఇంటింటికి

దేశ చరిత్రలో తొలిసారిగా ఈ జనగణనలో ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అండమాన్ నికోబార్ దీవులు, గోవా, కర్ణాటక, సిక్కిం, ఒడిశా, లక్షద్వీప్, మిజోరాం రాష్ట్రాలు, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి 15 వరకు స్వీయ లెక్కింపు అవకాశం ఉంటుంది. అనంతరం ఏప్రిల్ 16 నుంచి అధికారులు ఇంటింటికి వెళ్లి ఇళ్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తారు.

ఢిల్లీ ప్రాంతంలో ఈ ప్రక్రియ రెండు విడతలుగా జరుగుతుంది. ఎన్‌డీఎంసీ, ఢిల్లీ కాంటోన్మెంట్ ప్రాంతాల్లో ఏప్రిల్ 1–15 వరకు స్వీయ వివరాలు, ఏప్రిల్ 16–మే 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఎంసీడీ పరిధిలో మే 1–15 వరకు స్వీయ లెక్కింపు, మే 16–జూన్ 15 వరకు ఇంటింటి సర్వే జరుగుతుంది. స్వీయ వివరాలు నమోదు చేసిన పౌరులు పొందిన ప్రత్యేక ఎస్‌ఈ ఐడీని తర్వాత ఇంటికి వచ్చే లెక్కింపు అధికారికి చూపించాల్సి ఉంటుంది. అధికారులు ఆ వివరాలను ధృవీకరించి నమోదు చేస్తారు. ఈ పోర్టల్ లెక్కింపు కోసం రూపొందించిన మొబైల్ యాప్ మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో

ఇక ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి కూడా ఆన్‌లైన్‌లో స్వీయ వివరాలు పూర్తి చేసి ప్రజలు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్‌ మథూర్‌‌ , ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌, మిజోరాం ముఖ్యమంత్రి లాల్దూహోమా కూడా ఈ ప్రక్రియను ప్రారంభించారు. 2027 జనగణన స్వాతంత్ర్యం తర్వాత నిర్వహిస్తున్న 16వ జనగణన. ఇది రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశలో గృహ లెక్కింపు , రెండో దశలో జనాభా లెక్కింపు నిర్వహిస్తారు. ఈ గృహ లెక్కింపు సమయంలో అధికారులు ఇంటింటికి వెళ్లి ఇంటి సౌకర్యాలు, కుటుంబ అధిపతి పేరు, లింగం, ఇంటి యాజమాన్యం వంటి అంశాలపై మొత్తం 33 ప్రశ్నలు అడుగుతారు. కేంద్ర కేబినెట్ ఈ జనగణన కోసం రూ. 11,718 కోట్లు మంజూరు చేసింది. ఈసారి తొలిసారిగా కులాల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. గమనించదగ్గ విషయం ఏమంటే 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు డిజిటల్ విధానంలో దేశవ్యాప్తంగా ఈ భారీ ప్రక్రియను చేపడుతున్నారు.