Let's talk: editor@tmv.in
డిజిటల్ కరెన్సీతో భారత పీడీఎస్‌కు కొత్త రూపం ఇవ్వగలమా?

డిజిటల్ కరెన్సీతో భారత పీడీఎస్‌కు కొత్త రూపం ఇవ్వగలమా?

Shashank Sekhar
17 ఫిబ్రవరి, 2026

ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)తో అనుసంధానిస్తూ గుజరాత్ లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రయోగం అహ్మదాబాద్ (సబర్మతి జోన్), సూరత్, ఆనంద్, వల్సాద్ జిల్లాల్లోని సుమారు 26,000 లబ్ధిదారుల కుటుంబాలను కవర్ చేస్తోంది. ఈ-కేవైసీ పూర్తి చేసిన లబ్ధిదారులు ఆర్బీఐ-సంక్షేమ డిజిటల్ వాలెట్లలో టోకెన్లను పొందుతారు. వీటిని ఫెయిర్ ప్రైస్ షాపుల్లో క్యూఆర్ కోడ్ లేదా ఓటీపీ ధృవీకరణ ద్వారా వినియోగించవచ్చు. గుజరాత్‌లో సుమారు 75 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవి 3 కోట్లకుపైగా ప్రజలను కవర్ చేస్తున్నాయి. పైలట్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా, ఆపై ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. బయోమెట్రిక్ ధృవీకరణ, భౌతిక రికార్డులకే పరిమితమైన పాత విధానానికి భిన్నంగా, సార్వభౌమ డిజిటల్ కరెన్సీ ద్వారా ఆహార సబ్సిడీ పంపిణీ చేయడం ఇదే తొలిసారి.

రేషన్ నుంచి హక్కుగా – పీడీఎస్ పరిణామం

భారత పీడీఎస్ 1940లలో యుద్ధకాల రేషన్ విధానంగా ప్రారంభమైంది. స్వాతంత్ర్యం అనంతరం ఇది విశ్వవ్యాప్త పంపిణీ విధానంగా మారింది. 1997లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టీపీడీఎస్)గా మారి బీపీఎల్ కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చింది. 2013లో వచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఏ)తో ఆహార భద్రత చట్టబద్ధ హక్కుగా మారింది. గ్రామీణ జనాభాలో 75%, పట్టణాల్లో 50% వరకు — దాదాపు దేశ జనాభాలో రెండో, మూడవ వంతు (67%) — కవరేజ్ కల్పించింది. 2026 నాటికి పీడీఎస్ కేవలం సంక్షేమ పథకంగా కాకుండా, భారత ఆహార భద్రతా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా నిలిచింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ వ్యవస్థ

ప్రస్తుతం పీడీఎస్ ద్వారా 80–81 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5.3 లక్షల ఫెయిర్ ప్రైస్ షాపులు పనిచేస్తున్నాయి. దాదాపు 100% రేషన్ కార్డులు డిజిటలైజ్ అయ్యాయి. 95% కంటే ఎక్కువ ఆధార్‌తో అనుసంధానమై, సుమారు 5 లక్షల ఈపీఓఎస్ యంత్రాల ద్వారా ధృవీకరణ జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర సంస్థలు కలిసి 600 లక్షల టన్నులకు పైగా బియ్యం, గోధుమలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నాయి. ఎన్ఎఫ్ఎస్ఏ కింద ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ధాన్యం అందుతుంది. కరోనా వంటి మహమ్మారి సంక్షోభ సమయంలో పంపిణీ పరిమాణం సాధారణ స్థాయికంటే 40% పెరిగింది. రూ.2–3 కిలో ధరకు లభించే ధాన్యం మార్కెట్ ధరలతో పోలిస్తే 80–90% వరకు ఆదా కలిగిస్తుంది. ఈ వ్యవస్థ సేకరణ, నిల్వ, రవాణా, పంపిణీ స్థాయి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ప్రజా సేవలలో ఒకటిగా నిలుస్తోంది.

నిర్మాణాత్మక సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి

డిజిటలైజేషన్ ఉన్నప్పటికీ, 10–30% వరకు తక్కువ అంచనా వేశారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఇది 40% దాటింది. అర్హులైన కుటుంబాల్లో 10–15% వరకు వర్గీకరణలో తప్పిపోతుండగా, కొంతమంది అర్హులు కానివారు ప్రయోజనం పొందుతున్నారు. బయోమెట్రిక్ ధృవీకరణలో 2–5% వరకు లావాదేవీలు విఫలమవుతున్నా, శాతం పరంగా తక్కువగా కనిపించినా, సంఖ్యలో లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్నాయి. ఫెయిర్ ప్రైస్ షాపుల యాజమాన్యానికి తక్కువ కమీషన్లు, ఆలస్యంగా చెల్లింపులు చేయడం సమస్యలుగా మారాయి. 75% కంటే ఎక్కువ బియ్యం పంపిణీపైనే ఆధారపడటం పోషకాహార లోపాలకు దారితీస్తోంది.

డిజిటల్ కరెన్సీ ఈ లోపాలను సరిచేయగలదా?

సీబీడీసీ టోకెన్ల ద్వారా సబ్సిడీ విలువను నేరుగా డిజిటల్ రూపంలో జారీ చేయడం వల్ల రియల్-టైమ్ ట్రాకింగ్ సాధ్యమవుతుంది. బయోమెట్రిక్ వైఫల్యాల స్థానంలో ఓటీపీ ఆధారిత ధృవీకరణ ఉపయోగించడం వల్ల 5% వరకు ఉన్న సమస్యలు తగ్గవచ్చు. డిజిటల్ లావాదేవీలు లీకేజీలను 10–15% కంటే తక్కువ స్థాయికి తగ్గించగలవు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో క్యూఆర్ ఆధారిత ధృవీకరణ వల్ల మానవ జోక్యం తగ్గుతుంది. అయితే, లబ్ధిదారుల గుర్తింపు లోపాలు డిజిటల్ వ్యవస్థతో మాత్రమే సరిచేయలేం. అర్హులైన 10% కుటుంబాలు బయటే ఉంటే, సాంకేతికత వారికి హక్కును కల్పించలేదు.

పోర్టబిలిటీ, పారదర్శకత, సమగ్రత

వన్ నేషన్, వన్ రేషన్ కార్డు (ఓన్వోఆర్సీ ) ద్వారా అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ ఇప్పటికే దాదాపు 100% లబ్ధిదారులకు అందుబాటులో ఉంది. వలస కార్మికులు — దేశ కార్మిక శక్తిలో 10–15% — ఎక్కడ ఉన్నా తమ హక్కులను వినియోగించుకోగలుగుతున్నారు. సీబీడీసీని ఓన్వోఆర్సీ తో అనుసంధానిస్తే, సబ్సిడీ వ్యవస్థ పూర్తిగా పోర్టబుల్, రియల్-టైమ్ పారదర్శకంగా మారవచ్చు. అయితే, లబ్ధిదారుల జాబితాలపై క్రమానుగత డేటా ఆడిట్లు అవసరం. ధాన్యం బుట్టలో కనీసం 15–20% వరకు పప్పులు, సిరిధాన్యాలు చేర్చడం ద్వారా పోషక భద్రతను బలోపేతం చేయాలి. 5 లక్షలకు పైగా ఫెయిర్ ప్రైస్ షాపుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించాలి. 2–5% ధృవీకరణ వైఫల్యాలు పూర్తిగా తొలగించడానికి డిజిటల్ మౌలిక వసతులపై పెట్టుబడులు అవసరం.

దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి పీడీఎస్ జీవనాధారం. దీని సంస్కరణలు కేవలం పరిపాలనా మార్పులు కావు. అవి ఆహార స్వావలంబన, సామాజిక న్యాయమే . గుజరాత్‌లో ప్రారంభమైన సీబీడీసీ పైలట్ ఒక సాహసోపేత సాంకేతిక అడుగు. కానీ దీని విజయాన్ని నిర్ణయించేది కేవలం డిజిటల్ లావాదేవీలు కాదు. పారదర్శకత, సమగ్రత, నిర్మాణాత్మక లోపాల సవరణ, ముఖ్యంగా లబ్ధిదారుల గౌరవాన్ని కాపాడటమే అసలు ప్రమాణం.