Let's talk: editor@tmv.in
డిజిటల్ ఇన్నోవేషన్‌లో టీజీఎన్‌పీడీసీఎల్ ప్రతిష్టాత్మక 'గవర్నెన్స్ నౌ' అవార్డుల కైవసం

డిజిటల్ ఇన్నోవేషన్‌లో టీజీఎన్‌పీడీసీఎల్ ప్రతిష్టాత్మక 'గవర్నెన్స్ నౌ' అవార్డుల కైవసం

Gaddamidi Naveen
24 మార్చి, 2026

తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్) జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. డిజిటల్ ఆవిష్కరణలు, కార్యాచరణ నాయకత్వంలో చూపిన ప్రతిభకు గాను ప్రతిష్టాత్మక 'గవర్నెన్స్ నౌ 12వ ప్రభుత్వ రంగ సంస్థల అవార్డు - 2026'ను కైవసం చేసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం ఈ అవార్డును అందుకోగా, సోమవారం హన్మకొండలోని విద్యుత్ భవన్‌లో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి దీనిని అధికారికంగా అందజేశారు.

టీజీఎన్‌పీడీసీఎల్ ఈ ఏడాది మూడు ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ ప్రధాన విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మార్గదర్శకత్వంలోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇది సంస్థలోని ప్రతి ఉద్యోగి కష్టానికి దక్కిన గుర్తింపు అని ఆయన కొనియాడారు.

టీజీఎన్‌పీడీసీఎల్ సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన వినూత్న మార్పులు సంస్థకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఏఐ ఆధారిత ఫీడర్ అవుటేజ్ ప్రిడిక్షన్ వ్యవస్థ ద్వారా ఫీడర్ ఫిర్యాదులు, నిర్వహణ రికార్డులు, వాతావరణ డేటాను విశ్లేషించి ముందస్తుగా లోపాలను గుర్తిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి.

రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వోల్టేజ్, కరెంట్, లోడింగ్ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలను వేగంగా గుర్తిస్తున్నారు. అలాగే ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్ సహాయంతో 33 కేవీ, 11 కేవీ లైన్లలో లోపాలను త్వరగా గుర్తించి పరిష్కరిస్తున్నారు. విద్యుత్ లైన్లలో లోపాలను త్వరగా గుర్తించేందుకు 8,882 ఎఫ్‌పిఐలను ఏర్పాటు చేసి, మరమ్మతు సమయాన్ని గణనీయంగా తగ్గించడం. అలాగే లోపాలను ఈ సాంకేతికత ద్వారా సరిచేసినట్లు సంస్థ వెల్లడించింది. సుమారు 72 లక్షల వినియోగదారులకు సేవలందిస్తున్న టీజీఎన్‌పీడీసీఎల్, వినియోగదారుల సౌలభ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలం బాట, ప్రజా బాట కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరిస్తూ, ప్రతి సోమవారం నిర్వహించే ఎలక్ట్రిసిటీ ప్రజావాణి ద్వారా వేలాది ఫిర్యాదులను పరిష్కరించారు.

అదేవిధంగా 24 గంటల 1912 కాల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్టోరేషన్ టీమ్స్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందిస్తున్నారు. డిజిటల్ సేవలలో భాగంగా మొబైల్ యాప్, వాట్సాప్ చాట్‌బాట్, యూపీఐ వంటి పేమెంట్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చి వినియోగదారులకు సులభమైన సేవలను అందిస్తున్నారు. ఇటీవల ఐపీపీఏఐ పవర్ అవార్డ్స్ 2026లో కూడా ఇన్నోవేషన్ విభాగంలో అవార్డు అందుకోవడం ద్వారా టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ రంగంలో సాంకేతిక ఆధారిత సంస్థగా తన స్థానాన్ని మరింత బలపరచుకుంది.