Let's talk: editor@tmv.in
డిజిటల్ ఆరెస్ట్ పేరిట రూ. 58 కోట్ల చోరీ

డిజిటల్ ఆరెస్ట్ పేరిట రూ. 58 కోట్ల చోరీ

Panthagani Anusha
17 అక్టోబర్, 2025

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఈ మోసగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. వారిలోని భయం, నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని నేరగాళ్లు భారీ మొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నారు. అయితే తాజాగా ముంబైలో జరిగిన ఒక సంచలన కేసులో 72 ఏళ్ల వృద్ధ వ్యాపారి 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లో రూ. 58 కోట్లు పోగొట్టుకోవడం కలకలం సృష్టించింది.

సీబీఐ అధికారులమంటూ నమ్మించి

ముంబైలో నివాసముంటున్న ఓ వృద్ధ వ్యాపారిని రూ. 58 కోట్లకు మోసం చేసిన కేసులో, నేరగాళ్లు అత్యంత ఆధునికమైన 'డిజిటల్ అరెస్ట్' పద్ధతిని ఉపయోగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 19 నుండి అక్టోబర్ 8 మధ్య మోసగాళ్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులమంటూ నమ్మించి బాధిత వ్యాపారి పేరు మనీ లాండరింగ్ కేసులో ఉందని బెదిరించారు. అంతేకాక వారు వీడియో కాల్ ద్వారా వ్యాపారిని అతని భార్యను తాము డిజిటల్ అరెస్ట్‌లో ఉంచినట్లు భ్రమ కలిగించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పిన నిర్దిష్ట బ్యాంక్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, భయపడిన సదరు వ్యాపారి చివరికి రూ. 58 కోట్లను మోసగాళ్లు చెప్పిన ఖాతాల్లో జమ చేశాడు.

కాగా ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు తనకు కాల్ చేసింది సీబీఐ అధికారులు కాదని తానను సైబర్ నేరగాళ్ల మోసం చేసినట్లు గ్రహించిన వ్యాపారి ఈ భారీ మోసంపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించాడు. బాధిత వృద్ధుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ విభాగం వెంటనే దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఈ మోసానికి పాల్పడిన అబ్దుల్ ఖుల్లి (47, మాలాడ్), అర్జున్ కడ్వాసరా (55) జేతరామ్ (35 ) అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించిన అధికారులు బాధితుడి నుంచి కాజేసిన డబ్బును 18 వేరువేరు ఖాతాల్లో కి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆ ఖాతాలకు సంబంధించి ఆయ బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలను ఫ్రీజ్ చెంచినట్లు అధికారులు వెల్లడించారు.

.

ఈ సంఘటన సీనియర్ పౌరులు మోసగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. మరోవైపు సైబర్ పోలీసు అధికారి స్పందిస్తూ ఇలాంటి మోసాల్లో నేరగాళ్లు అధికారుల పేర్లు ఉపయోగించి భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు ఈ రకమైన మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ ఫోన్ కాల్స్ ద్వారా డబ్బు అడగరు. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ ద్వారా పోలీసులను సంప్రదించని అని సూచించారు.

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

ఇది ఒక సైబర్ మోసం పద్ధతి. ఇందులో మోసగాళ్లు తమను పోలీస్ లేదా సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుని బాధితులను బెదిరిస్తారు. “మీ మీద కేసు ఉంది, మీరు అరెస్ట్ అవుతారు” అని భయపెట్టి డబ్బు వసూలు చేస్తారు.

డిజిటల్ ఆరెస్ట్ పేరిట రూ. 58 కోట్ల చోరీ - Tholi Paluku