Let's talk: editor@tmv.in
డిజిటల్ అరెస్ట్ మోసంలో రూ.7 కోట్లకు పైగా నష్టపోయిన 81 ఏళ్ల వృద్ధుడు

డిజిటల్ అరెస్ట్ మోసంలో రూ.7 కోట్లకు పైగా నష్టపోయిన 81 ఏళ్ల వృద్ధుడు

Gaddamidi Naveen
5 జనవరి, 2026

హైదరాబాద్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడిని ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీగా మోసం చేశారు. ముంబై పోలీసులమని నటిస్తూ బెదిరింపులకు పాల్పడి, సుమారు రూ.7.12 కోట్లను వృద్ధుడి నుంచి వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

పోలీసుల తెలిపిన‌ వివరాల ప్రకారం, గత ఏడాది అక్టోబర్ 27న వృద్ధుడికి మొదటగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఒక కూరియర్ కంపెనీకి చెందినవాడినని పరిచయం చేసుకుని, వృద్ధుడి పేరుతో ముంబై నుంచి థాయిలాండ్‌కు ఒక పార్సిల్ పంపించబడిందని తెలిపాడు. ఆ పార్సిల్‌లో ఎండీఎంఏ మాదకద్రవ్యాలు, పాస్‌పోర్టులు, డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పాడు.

ఆ తర్వాత ఆ కాల్ ముంబై పోలీసులకు ఫార్వర్డ్ చేశామని చెప్పి, కొద్దిసేపటికి మరో వ్యక్తి ముంబై పోలీస్ అధికారి అని నటిస్తూ వృద్ధుడికి ఫోన్ చేశాడు. వృద్ధుడు డ్రగ్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పెద్ద కేసులో నిందితుడిగా ఉన్నాడని ఆరోపించాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే తన బ్యాంకు ఖాతాలు, పెట్టుబడుల వివరాలను ధృవీకరించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.‘వెరిఫికేషన్’ పేరుతో వృద్ధుడిని పూర్తిగా భయభ్రాంతులకు గురిచేస్తూ, తాము సూచించిన ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయాలని ఆదేశించాడు. విచారణ పూర్తయిన తర్వాత నిర్దోషిగా తేలితే డబ్బు తిరిగి ఇస్తామని చెప్పాడు. అంతేకాకుండా, ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించాడు.

ఈ బెదిరింపులు, ఒత్తిడుల మధ్య వృద్ధుడు రెండు నెలల కాలంలో విడతలవారీగా రూ.7.12 కోట్లను మోసగాళ్లు సూచించిన ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఆ తర్వాత వారు మరో రూ.1.2 కోట్లు కోరడంతో అనుమానం వచ్చి, తాను మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో గత నెల డిసెంబర్ 30న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు గతంలో వ్యాపారం చేసిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

డిజిటల్ అరెస్ట్ అనేది ఒక రకమైన సైబర్ మోసం. ఇందులో నేరగాళ్లు పోలీస్ లేదా దర్యాప్తు సంస్థల అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా బాధితులను భయపెట్టి, వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారు. పోలీసులు ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

డిజిటల్ అరెస్ట్ మోసంలో రూ.7 కోట్లకు పైగా నష్టపోయిన 81 ఏళ్ల వృద్ధుడు - Tholi Paluku