
డిజిటల్ అరెస్ట్ పేరిట రూ. 31 లక్షలు లూటీ
సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. అయితే ప్రజల నమ్మకాన్ని దోపిడీ చేయడానికి నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని అమరావతిలో ఓ 71 ఏళ్ల రిటైర్డ్ జడ్జిని డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 31లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ముంబై నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు బుధవారం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, సెప్టెంబర్ 25న బాధిత రిటైర్డ్ న్యాయమూర్తికి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను పోలీసు అధికారిని అని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, మీ పేరుతో ఉన్న సిమ్ కార్డు ద్వారా అసభ్య సందేశాలు పంపబడ్డాయి అని ఆరోపించాడు. అంతేకాక, మీ పేరు మనీలాండరింగ్ కేసులో ఉంది, మీ బ్యాంకు ఖాతా మోసానికి ఉపయోగించారని నమ్మించాడు.
హైకోర్టు ఆదేశాలు పేరిట మోసం
మోసాన్ని నిజమని నమ్మించేందుకు, నేరగాడు వీడియో కాల్ ద్వారా బాధితుడితో మాట్లాడాడు. తాను ఉన్నతాధికారినని నటిస్తూ హైకోర్టు ఆదేశాల పేరుతో విచారణ జరుగుతోందని భయపెట్టాడు. బాధితుడి ఖాతా ద్వారా రూ. 30 లక్షల అక్రమ లావాదేవీలు జరిగినట్లు చెప్పి నమ్మించాడు. ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదని, పోలీసులను సంప్రదిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని హెచ్చరించాడు. ఈ బెదిరింపులతో భయపడిన ఆ వృద్ధుడు నేరగాళ్లు సూచించిన రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో రూ. 31 లక్షలు జమ చేశారు. అంతేకాక విచారణలో మీ పేరు క్లియర్ అయితే డబ్బు తిరిగి ఇస్తాం” అని హామీ ఇచ్చాడు.
అయితే పది రోజులకుపైగా గడిచినా నేరస్తుల నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మాజీ జడ్జికి అనుమానం కలిగింది. వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో తాను మోసానికి గురైనట్టు గ్రహించి, అమరావతి సైబర్ పోలీసులను సంప్రదించారు. ఇక జడ్జి ఇచ్చిన సమాచారం తో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు . నిందితుల బ్యాంకు లావాదేవీలు, ఫోన్ నంబర్లను ట్రేస్ చేస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.
మరోవైపు సైబర్ పోలీసు అధికారి స్పందిస్తూ ఇలాంటి మోసాల్లో నేరగాళ్లు అధికారుల పేర్లు ఉపయోగించి భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు ఈ రకమైన మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ ఫోన్ కాల్స్ ద్వారా డబ్బు అడగరు. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ ద్వారా పోలీసులను సంప్రదించని అని సూచించారు.
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?
ఇది ఒక సైబర్ మోసం పద్ధతి. ఇందులో మోసగాళ్లు తమను పోలీస్ లేదా సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుని బాధితులను బెదిరిస్తారు. “మీ మీద కేసు ఉంది, మీరు అరెస్ట్ అవుతారు” అని భయపెట్టి డబ్బు వసూలు చేస్తారు.
