
డిజిటల్ అరెస్ట్: అదృశ్య సంకెళ్లు
ఇటీవల తాజాగా బెంగళూరులోని విక్టోరియా రోడ్డులో నివసించే 94 ఏళ్ల వృద్ధ పరిశోధకుడి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఒక సాధారణ ఫోన్ కాల్‌తో మొదలైన ఈ నాటకం, ఆయనను తన సొంత ఇంట్లోనే ఒక అదృశ్య ఖైదీగా మార్చేసింది. బెస్కామ్ ఉద్యోగిగా నటించిన ఒక వ్యక్తి నుండి వచ్చిన కాల్, ఆయనపై బళ్లారిలో 'మానవ అక్రమ రవాణా' కేసు నమోదైందని భయపెట్టింది. ఆతరువాత వెంటనే 'సందీప్ రావు' అనే నకిలీ సీబీఐ అధికారి రంగ ప్రవేశం చేసి, వీడియో కాల్ ద్వారా యూనిఫాంలో దర్శనమిచ్చి, బాధితుడిని 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ వృద్ధుడు తన 94 ఏళ్ల జీవితంలో ఎన్నడూ చూడని ఈ ఆధునిక నేరం, కేవలం కొన్ని రోజుల వ్యవధిలో ఆయన నుండి రూ. 4.9 కోట్లు దోచుకుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన నష్టం కాదు. ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి, ముఖ్యంగా సాంకేతికతపై తక్కువ అవగాహన ఉన్న వృద్ధులకు పొంచి ఉన్న ఒక పెను ముప్పు.ఇటీవల భారతదేశం అంతటా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు సంబంధించిన అనేక కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులు ఈ స్కామ్ యొక్క తీవ్రతను, నేరగాళ్ల క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తాయి.
హైదరాబాద్ సీనియర్ సిటిజన్ దోపిడీ
హైదరాబాద్‌కు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగికి నేరగాళ్లు ఫోన్ చేసి, కస్టమ్స్ అధికారులమని నమ్మించారు. ఆయన పేరు మీద వచ్చిన ఒక పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టారు. 24 గంటల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచి, ఆయన బ్యాంక్ అకౌంట్ నుండి దాదాపు రూ.1.92 కోట్లను నేరగాళ్లు దోచుకున్నారు. ఈ కేసులో సైబర్ పోలీసులు దర్యాప్తు చేసి, కొంతమంది నిందితులను అరెస్ట్ చేసినా, పూర్తి డబ్బును రికవర్ చేయడం కష్టంగా మారింది.
ముంబై భారీ మనీ లాండరింగ్ నెట్‌వర్క్
ఇటీవల ముంబై సైబర్ పోలీసులు రూ.58.13 కోట్ల భారీ సైబర్ మోసంపై దర్యాప్తు చేశారు. ఈ కేసులో నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌తో సహా పలు రకాల సైబర్ మోసాల ద్వారా డబ్బు దోచుకున్నారు. దర్యాప్తులో, నేరగాళ్లు దోచుకున్న డబ్బును తరలించడానికి దేశవ్యాప్తంగా వేలాది నకిలీ బ్యాంక్ ఖాతాలను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ ఖాతాలను పేద ప్రజల పేరుతో, వారికి కొంత డబ్బు ఆశ చూపి తెరిపించారు.
కర్ణాటకలో విషాదం - వృద్ధ దంపతుల ఆత్మహత్య
కర్ణాటకకు చెందిన ఒక వృద్ధ దంపతులు డిజిటల్ అరెస్ట్ స్కామ్ బారిన పడ్డారు. నేరగాళ్లు వారిని తీవ్రంగా భయపెట్టి, వారి రిటైర్మెంట్ డబ్బు రూ.50 లక్షలను దోచుకున్నారు. ఆర్థికంగా రోడ్డున పడిన ఆవేదన, అవమాన భారం తట్టుకోలేక, ఆ దంపతులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ స్కామ్‌ల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని ఎత్తిచూపింది.
పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోసం
టెక్నాలజీపై అవగాహన ఉన్నవారు కూడా ఈ స్కామ్ బారిన పడుతున్నారని పూణే కేసు నిరూపించింది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు నేరగాళ్లు ఫోన్ చేసి, ఆర్‌బిఐ అధికారులమని నమ్మించారు. ఆయన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిందని, డబ్బును సేఫ్ అకౌంట్‌కు తరలించాలని చెప్పారు. ఇంజనీర్ వారి మాటలు నమ్మి దాదాపు రూ.25 లక్షలను నేరగాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ కేసులు డిజిటల్ అరెస్ట్ స్కామ్ యొక్క భయానక రూపాన్ని దాని నుండి ఎవరూ మినహాయింపు కాదనే సత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
మోసగాళ్ల మనస్తత్వ శాస్త్రం: భయం, ఒంటరితనం
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో నేరగాళ్లు వాడే ప్రధాన ఆయుధం బాధితుడి మనస్సును నియంత్రించడం. బెంగళూరు కేసులో చూసినట్లుగా, నేరగాళ్లు బాధితుడిని ఎవరితోనూ మాట్లాడకుండా 'ఐసోలేషన్' లో ఉంచుతారు. "ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం, ఎవరికైనా చెబితే మీ కుటుంబం మొత్తం జైలుకు వెళ్తుంది" అని బెదిరిస్తారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి వాట్సాప్‌లో తాము ఉన్నామని 'రిపోర్ట్' చేయాలని ఆదేశించడం ద్వారా బాధితుడి ఆలోచనా శక్తిని హరిస్తారు. ఈ మానసిక ఒత్తిడి వల్ల, 90 ఏళ్లు పైబడిన వారు కూడా తార్కికంగా ఆలోచించలేక, తమ కష్టార్జితాన్ని నేరగాళ్ల అకౌంట్లలోకి గుమ్మరిస్తున్నారు. భయం అనేది మనిషి విచక్షణను చంపేస్తుంది, నేరగాళ్లు సరిగ్గా ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు.
నకిలీ సెటప్: స్క్రీన్ వెనుక పోలీస్ స్టేషన్లు
ఈ స్కామ్ విజయవంతం కావడానికి కారణం నేరగాళ్లు సృష్టించే 'ప్రొఫెషనల్' వాతావరణం. వీడియో కాల్ చేసినప్పుడు అవతలి వైపు వ్యక్తులు ఖాకీ యూనిఫాంలో ఉంటారు. వారి వెనుక గోడలపై పోలీస్ లోగోలు, చట్టపు పుస్తకాలు, వైర్‌లెస్ సెట్లు వంటివి అమర్చి ఒక నిజమైన పోలీస్ స్టేషన్ లేదా సీబీఐ కార్యాలయంలా భ్రమ కలిగిస్తారు. బెంగళూరు వృద్ధుడికి పంపినట్లుగా, వాట్సాప్ ద్వారా నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్ట్ వారంట్లు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు పంపుతారు. ఈ పత్రాలపై ఉండే ప్రభుత్వ ముద్రలు, సంతకాలు చూసి సామాన్యులు అవి అసలైనవి కావని గుర్తించలేరు. సాంకేతికతను వాడుకుని ముఖాలను మార్చడం (డీప్ ఫేక్) లేదా నకిలీ సెట్టింగ్‌లను సృష్టించడం ఈ ముఠాలకు వెన్నతో పెట్టిన విద్య.
ఆర్థిక వ్యవస్థపై దెబ్బ: కోట్ల రూపాయల విదేశీ తరలింపు
భారతదేశంపై ఈ స్కామ్ ప్రభావం ఊహించలేనంత భారీగా ఉంది. బెళగావిలో ఒక వ్యాపారవేత్త నుండి రూ. 15 కోట్లు, బెంగళూరు వృద్ధుడి నుండి రూ.4.9 కోట్లు, ఇలా రోజుకు కోట్లాది రూపాయలు దేశం దాటిపోతున్నాయి. హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఈ దోపిడీ సొమ్ములో ఎక్కువ భాగం మయన్మార్, లావోస్, కంబోడియా వంటి దేశాలకు తరలిపోతోంది. అక్కడ పెద్ద ఎత్తున 'కాల్ సెంటర్' మాఫియాలు నడుస్తున్నాయి. వీరు దోచుకున్న డబ్బును వందలాది 'మ్యూల్ అకౌంట్స్' ద్వారా తిప్పుతూ, చివరికి క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చి విదేశాలకు పంపిస్తున్నారు. ఇది దేశ ఆర్థిక భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది.
టార్గెట్ వృద్ధులు
నేరగాళ్లు తమ వేట కోసం వృద్ధులను ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. నేటి కాలంలో చాలా మంది వృద్ధులు నగరాల్లో ఒంటరిగా నివసిస్తున్నారు. వారికి డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ నేరాల పద్ధతులపై పూర్తి అవగాహన ఉండదు. చట్టం అంటే భయం, సమాజంలో గౌరవం పోతుందనే ఆందోళన వారిని లొంగదీసుకునేలా చేస్తాయి. 94 ఏళ్ల పరిశోధకుడి కేసులో చూస్తే, ఆయన తన గౌరవం కోసం నిశ్శబ్దంగా డబ్బు చెల్లించారు. వృద్ధులు తరచుగా తమ పిల్లలకు లేదా స్నేహితులకు చెప్పడానికి సంకోచిస్తారు, ఇది నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ సామాజిక ఒంటరితనం నేరగాళ్లకు అతిపెద్ద పెట్టుబడిగా మారుతోంది.
చట్టపరమైన లొసుగులు
భారతదేశంలో సైబర్ చట్టాలు ఉన్నప్పటికీ, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త రకం నేరాలను ఎదుర్కోవడంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. నేరగాళ్లు వాడుతున్న సిమ్ కార్డులు నకిలీ ఐడీలతో ఉన్నవి కావడం, కాల్స్ అన్నీ ఇంటర్నెట్ ద్వారా రావడం వల్ల వారి స్థానాన్ని గుర్తించడం కష్టమవుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఒక అకౌంట్ నుండి డబ్బు పోగానే దానిని వెంటనే ఫ్రీజ్ చేసే వ్యవస్థ ఇంకా వేగవంతం కావాల్సి ఉంది. బెంగళూరు పోలీసులు ఈ కేసులో పలు వాట్సాప్ నంబర్లను గుర్తించినప్పటికీ, అవి విదేశీ సర్వర్లతో అనుసంధానమై ఉండటం వల్ల దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది.
అసలు 'డిజిటల్ అరెస్ట్' అంటే ఏమిటి?
“డిజిటల్ అరెస్ట్” అనేది అసలు చట్టపరమైన పదం కాదు. ఇది సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఒక భ్రమ. చట్టపరమైన వ్యవస్థలో, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు భౌతికంగా అక్కడికి రావాలి, వారంట్ చూపించాలి. చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలి. వీడియో కాల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా ఎవరినీ "అరెస్ట్" చేసే అధికారం ఏ చట్ట అమలు సంస్థకూ లేదు. కానీ, ఈ స్కామ్‌లో నేరగాళ్లు సరిగ్గా ఈ విషయాన్నే వాడుకుంటారు. వారు బాధితులకు ఫోన్ చేసి, తాము సిబిఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, కస్టమ్స్ లేదా రాష్ట్ర పోలీసు అధికారులమని పరిచయం చేసుకుంటారు. బాధితుడు ఏదో తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు, వారి పేరుపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు నమ్మిస్తారు.
ఈ స్కామ్‌లో ప్రధాన ఆయుధం భయం. బాధితులను "మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారు, మా అనుమతి లేకుండా ఫోన్ కట్ చేయకూడదు, ఎవరికీ చెప్పకూడదు, కెమెరా ముందు నుండి కదలకూడదు" అని ఆదేశిస్తారు. ఈ విధంగా, బాధితుడు తన ఇంట్లోనే, తన ఫోన్ స్క్రీన్ ముందు బందీగా మారిపోతాడు. ఇది వారిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది, తద్వారా వారు తార్కికంగా ఆలోచించే శక్తిని కోల్పోతారు.
భారతదేశంలో డిజిటల్ విప్లవం వేగంగా విస్తరించింది. కానీ, అదే స్థాయిలో డిజిటల్ అక్షరాస్యత, భద్రతా అవగాహన పెరగలేదు. దీనిని సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా చట్టం పట్ల గౌరవం, భయం ఉన్న సాధారణ పౌరులు వీరి ప్రధాన లక్ష్యం.
డిజిటల్ అరెస్ట్ అనేది ఒక మోసపు పద్ధతి, ఇది బాధితులను భయంతో, మోసంతో, బెదిరింపుతో డబ్బు వసూలు చేయడానికి రూపొందించబడింది. మోసగాళ్లు చట్ట అమలులో ఉన్న అధికారులు అని నటిస్తూ, అరెస్ట్, బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం, పాస్‌పోర్ట్ రద్దు వంటి బెదిరింపులు చూపిస్తారు. తద్వారా, బాధితులను “ఫైన్” లేదా “సెక్యూరిటీ డిపాజిట్” చెల్లించమని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు.
సాధారణంగా ఈ మోసం ఫోన్ కాల్ తో ప్రారంభమవుతుంది. మొదట సాధారణంగా కనిపిస్తుంది, ఉదాహరణకు హర్మ్ పార్శిల్ డెలివరి క్లెయిమ్ లేదా కే వై సి నిర్ధారణ కోసం. కానీ కాల్ కొనసాగుతున్న కొద్దీ, మోసగాళ్లు మరింత ధీటుగా, తీవ్రతరమైన వ్యూహాలను వాడి, బాధితులలో పానిక్ కలిగిస్తారు. వారు ఫోన్ చేసి బాధితుడు సీరియస్ మనీ లాండరింగ్, సైబర్ నేరాలు, డ్రగ్ రవాణా వంటి వాటిలో నిందితుడిగా ఉన్నాడంటూ అంటారు. ఫేక్ డాక్యుమెంట్స్, మార్చబడ్డ వీడియోలు చూపించి, నకిలీ ఫోన్ నంబర్లు వాడి, మోసగాళ్లు తమ కేసును నిజమైనట్లు చూపిస్తారు.
ప్రజలు గ్రహించాల్సిన అతిముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత చట్టంలో 'డిజిటల్ అరెస్ట్' అనే పదమే లేదు. సిఆర్పిసి ప్రకారం, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు నేరుగా వచ్చి వారంట్ చూపించాలి. ఏ జడ్జి లేదా పోలీస్ అధికారి వీడియో కాల్ ద్వారా విచారణ చేయరు లేదా డబ్బు డిమాండ్ చేయరు. బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును 'ప్రభుత్వ సురక్షిత ఖాతా'కు బదిలీ చేయమని ఏ అధికారి కోరరు. ఈ ప్రాథమిక జ్ఞానం లేకపోవడం వల్లే విద్యావంతులు సైతం ఈ మాయాజాలంలో పడిపోతున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడూ ఫోన్ కాల్ ద్వారా డబ్బు వ్యవహారాలు సాగించవని గుర్తించాలి.
ప్రభుత్వ చర్యలు, సైబర్ హెల్ప్‌లైన్ ప్రాముఖ్యత
కేంద్ర ప్రభుత్వం 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C) ద్వారా ఈ స్కామ్‌లపై యుద్ధం ప్రకటిస్తోంది. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (www.cybercrime.gov.in), హెల్ప్‌లైన్ నంబర్ 1930 గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. పోలీసులు వృద్ధులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే, మోసం జరిగిన మొదటి రెండు గంటలు అత్యంత కీలకం. ఆ సమయంలోపు ఫిర్యాదు చేస్తే బ్యాంకులు ఆ లావాదేవీని నిలిపివేసే అవకాశం ఉంటుంది. కానీ భయం వల్ల బాధితులు ఫిర్యాదు చేయడానికి రోజులు గడుస్తుండటం నేరగాళ్లకు కలిసి వస్తోంది.
నిపుణుల హెచ్చరిక: ఎలా రక్షణ పొందాలి?
ఏ చట్ట అమలు సంస్థకూ (పోలీస్, సిబిఐ, ఎన్‌సిబి, ఈడీ, కస్టమ్స్) వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం లేదు. వీడియో కాల్‌లో చట్టపరమైన ప్రక్రియ జరగదు. ఇది పూర్తిగా నకిలీ. నేరగాళ్లు మిమ్మల్ని భయపెట్టి, త్వరగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేస్తారు. భయపడవద్దు. ఫోన్ కట్ చేసి, నిదానంగా ఆలోచించండి. ఏ నిజమైన అధికారీ మిమ్మల్ని తక్షణమే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమని ఒత్తిడి చేయరు.
నేరగాళ్లు మిమ్మల్ని ఎవరికీ చెప్పకూడదని బెదిరిస్తారు. కానీ, మీరు వెంటనే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా విశ్వసనీయమైన వారితో మాట్లాడండి. వారి సలహా తీసుకోండి. సమస్యను ఇతరులతో పంచుకోవడం వల్ల మీరు ఒత్తిడి నుండి బయటపడవచ్చు వారు మీకు సహాయపడగలరు.
మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఏదైనా ఏజెన్సీ పేరు చెబితే, ఆ ఏజెన్సీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి ల్యాండ్‌లైన్ నంబర్‌ను సేకరించి, దానికి కాల్ చేసి ధృవీకరించుకోండి. వారు చెప్పిన ఎఫ్‌ఐఆర్ నంబర్ లేదా వారంట్ వివరాలను కూడా అధికారికంగా చెక్ చేసుకోవచ్చు
ఏ అధికారీ మీ ఓటీపీ , పాస్‌వర్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, లేదా ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగరు. ఇలాంటి వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దు.ముఖ్యంగా వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్స్‌ను అటెండ్ చేయకపోవడమే మంచిది. మీరు అటెండ్ చేసినా, మీ ముఖం నేరగాళ్లకు కనిపించకుండా కెమెరాను కవర్ చేయండి.
యూపీఐ రిక్వెస్ట్‌లు, క్యూఆర్ కోడ్ స్క్యామ్స్, కార్డ్ స్కిమ్మింగ్, సీమ స్వాప్స్, క్రిప్టో స్క్యామ్స్ వంటి పద్ధతులను ఉపయోగిస్తూ మోసగాళ్లు ఆన్‌లైన్ మోసాలను విస్తరిస్తారు.ఈ మోసాలు ఎక్కువగా మానవ తప్పిదాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించేటప్పుడు సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగిఉండడం మంచిది.
మాజీ ఐపీఎస్ అధికారులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నట్లుగా, రక్షణకు మొదటి మెట్టు 'అప్రమత్తత'. తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే అస్సలు ఎత్తకూడదు. ఒకవేళ పొరపాటున ఎత్తినా, ఎదుటివారు బెదిరిస్తుంటే వెంటనే ఫోన్ కట్ చేసి స్థానిక పోలీసులకు లేదా తెలిసిన వారికి సమాచారం ఇవ్వాలి. వాట్సాప్ సందేశాలకు సమాధానం ఇవ్వడం ఆపివేయాలి. మీ ఆధార్ కార్డు లేదా బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయకూడదు. మనసులో చిన్న అనుమానం వచ్చినా అది మోసం కావచ్చని భావించి, వెంటనే సంబంధిత అధికారిక కార్యాలయానికి వెళ్లి నేరుగా సంప్రదించాలి.
ప్రభుత్వ చర్యలు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎన్సిసిసి సైబర్ నేరాలను అరికట్టడానికి రాష్ట్ర పోలీసులతో, బ్యాంకులతో, టెలికాం కంపెనీలతో,ఇతర వాటాదారులతో సమన్వయం చేసుకుంటుంది. ఇది నేరాల డేటాను విశ్లేషించి, నేరగాళ్ల మోసపు పద్ధతులను గుర్తించి, వాటిపై అవగాహన పెంచుతుంది.
2025 చివరిలో, సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల తీవ్రతను గుర్తించి, సిబిఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. నేరగాళ్లు వాడుతున్న బ్యాంక్ ఖాతాలను, క్రిప్టోకరెన్సీ వాలెట్లను వెంటనే గుర్తించి, స్తంభింపజేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించి అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించింది.
నకిలీ సిమ్ కార్డ్, బ్యాంక్ ఖాతాల నియంత్రణ
టెలికాం శాఖ నకిలీ ఐడీలతో తీసుకున్న సిమ్ కార్డులను బ్లాక్ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటోంది. బ్యాంకులు కూడా 'నో యువర్ కస్టమర్' నిబంధనలను మరింత కఠినతరం చేసి, నకిలీ బ్యాంక్ ఖాతాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రభుత్వం, పోలీసులు సోషల్ మీడియా, రేడియో, టెలివిజన్,వార్తాపత్రికల ద్వారా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై ప్రజలకు అవగాహన పెంచుతున్నారు. ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ సహకారం
చాలా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు మయన్మార్, లావోస్, కంబోడియా వంటి విదేశాల నుండి నడుస్తున్నాయని దర్యాప్తులో తేలింది. అందువల్ల, భారత ప్రభుత్వం ఆ దేశాల ప్రభుత్వాలతో, అంతర్జాతీయ చట్ట అమలు సంస్థలతో (ఇంటర్‌పోల్) సమన్వయం చేసుకుని నేరగాళ్లను పట్టుకోవడానికి మనీ-లాండరింగ్ నెట్‌వర్క్‌లను విరమించడానికి ప్రయత్నిస్తోంది.
డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది కేవలం పోలీసుల సమస్య మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక సమస్య. ప్రతి ఇంట్లో ఉన్న యువత తమ తల్లిదండ్రులకు, తాతయ్యలకు ఈ మోసాల గురించి వివరించాలి. బెంగళూరులోని వృద్ధుడికి జరిగిన నష్టం మరొకరికి జరగకూడదు. సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో, మన అవగాహన కూడా అంతే స్థాయిలో పెరగాలి. "భయపడవద్దు - ప్రశ్నించండి" అనే నినాదంతో మనం ముందుకు సాగితేనే ఈ అదృశ్య నేరగాళ్ల సంకెళ్లను తెంచుకోగలం. భారతదేశం డిజిటల్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో, సైబర్ భద్రత ప్రతి పౌరుడి హక్కు, బాధ్యత కావాలి.
