
డి.కె. శివకుమార్ రూటే సెపరేటు ….
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సమక్షంలో జరిగిన నూతనంగా ఏర్పడిన గ్రేటర్ బెంగళూరు అథారిటీ మొదటి అధికారిక సమావేశం దాని తదనంతర పరిణామాలపై దృష్టి సారించింది.
ప్రధాన లక్ష్యాలు
చెత్త, ట్రాఫిక్ నిర్వహణ: నగరంలో పేరుకుపోయిన చెత్త సమస్యను వెంటనే పరిష్కరించాలని, ట్రాఫిక్ రద్దీకి దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు.
• అధికార వికేంద్రీకరణ: నగర పాలనను వికేంద్రీకరించడానికి, నగరంలో ఐదు కొత్త సిటీ కార్పొరేషన్లు, 368 వార్డుల ఏర్పాటు లక్ష్యంగా గ్రేటర్ బెంగళూరు అథారిటీ పనిచేస్తుంది.
• ముఖ్య పరిపాలనా సంస్కరణ: ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కీలకమైన ప్రకటన చేశారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కి ఉన్న అధికారాలు ఇకపై గ్రేటర్ బెంగళూరు అథారిటీ కి బదిలీ చేయబడతాయి. దీనితో గ్రేటర్ బెంగళూరు అథారిటీ నగరానికి అత్యున్నత ప్రణాళికా సంస్థగా మారుతుంది.
రాజకీయ ప్రతిస్పందన
• గ్రేటర్ బెంగళూరు అథారిటీ సమావేశాన్ని ప్రతిపక్షాలు (బీజేపీ, జేడీఎస్) బహిష్కరించాయి.గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి అధికారం కేంద్రీకృతమైందని వారు విమర్శించారు. అయితే, శివకుమార్ ప్రతిపక్షాల తీరును తప్పుపట్టారు.
"బెంగళూరు నడక" పౌర కార్యక్రమం: ఈ సమావేశం తర్వాత, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ప్రజలకు చేరువ అవ్వడానికి "వాక్ విత్ బెంగళూరు" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొట్టమొదటిగా ఈ నడక కార్యక్రమం అక్టోబర్ 11, 2025న బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ జోన్‌లోని లాల్‌బాగ్ పార్క్ లో జరిగింది.
• లక్ష్యం: ఈ కార్యక్రమం ద్వారా నగర నిర్వాహకులు, పౌర ప్రతినిధులు ప్రజలకు మరింత చేరువవుతారు. శివకుమార్ స్వయంగా నగరంలోని కొత్త కార్పొరేషన్ల అంతటా ఈ నడకలు, తనిఖీలు నిర్వహిస్తారు. పౌరులతో కలిసి నడవడం, అభిప్రాయాలను స్వీకరించడం, రోడ్లపై గుంతల వంటి సమస్యల పరిష్కారం కోసం తనిఖీ చేయడం ఇందులో భాగం.
• ఇతర ముఖ్య ప్రకటనలు: నిర్మాణ ఉల్లంఘనలపై నిర్ణయం: 30x40 చదరపు అడుగుల స్థలాలలో స్వల్ప నిర్మాణ ఉల్లంఘనలతో ఇళ్లు నిర్మించిన వారికి కంప్లీషన్ సర్టిఫికెట్లు, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు శివకుమార్ ప్రకటించారు. ఈ నిర్ణయం నగరంలో 3 - 4 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది.
