Let's talk: editor@tmv.in
డాక్ సేవకులు గ్రామీణ లాజిస్టిక్స్‌కు వారధులు:సీఎం

డాక్ సేవకులు గ్రామీణ లాజిస్టిక్స్‌కు వారధులు:సీఎం

Panthagani Anusha
23 ఫిబ్రవరి, 2026

మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతున్నా సామాన్యుడికి సేవలందించడంలో తపాలా శాఖ పోషించే పాత్ర వెలకట్టలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆదివారం విజయవాడలో జరిగిన 'గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళన్' కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్ సేవకుల సేవలను గుర్తుచేసుకుంటూ ముఖ్యమంత్రి ఆసక్తికర ప్రసంగం చేశారు.

జ్ఞాపకాల పొరల్లో పోస్ట్‌మ్యాన్

తన బాల్య స్మృతులను గుర్తుచేసుకుంటూ "మేము చదువుకునే రోజుల్లో పోస్ట్‌మ్యాన్ అంటే ఒక కుటుంబ సభ్యుడిలా ఉండేవాడు. ఏ చిన్న సమాచారం రావాలన్నా, మనీ ఆర్డర్ అందాలన్నా పోస్టాఫీసే మాకు ఏకైక దిక్కు. నేడు ఇంటర్నెట్, వాట్సాప్ వంటివి వచ్చినా.. మారుమూల గ్రామంలో ఒక పార్శిల్ చేరాలన్నా, ఒక నమ్మకమైన సేవ అందాలన్నా అది డాక్ సేవకుల ద్వారానే సాధ్యం. దేశవ్యాప్తంగా ఉన్న 1.64 లక్షల పోస్టాఫీసుల నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల అమల్లో కీలక భాగస్వామ్యం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సూపర్ 6' పథకాల విజయవంతం వెనుక డాక్ సేవకుల కృషి ఉందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 వేల మందికి పైగా డాక్ సేవకులు.. బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ 33 శాతం ప్రత్యక్ష నగదు బదిలీ సేవలను ప్రజల ముంగిటకే చేరుస్తున్నారని కొనియాడారు. "మెషిన్లు, ఏఐ (కృత్రిమ మేధ) పనులు చేయగలవు కానీ మీరిచ్చే 'హ్యూమన్ టచ్' అవి ఇవ్వలేవు" అని స్పష్టం చేశారు.

డాక్ సేవకులకు ఎలక్ట్రిక్ సైకిళ్లు.. కేంద్రానికి విజ్ఞప్తి

డాక్ సేవకుల సౌకర్యార్థం వారికి పర్యావరణహితమైన 'ఎలక్ట్రిక్ సైకిళ్లను' పంపిణీ చేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా కోరారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా సేవకులకు శారీరక వ్యాయామం కూడా లభిస్తుందని సూచించారు. కొత్తగా డిజైన్ చేసిన డ్రస్ కోడ్ ద్వారా డాక్ సేవకులకు సమాజంలో గౌరవం పెరుగుతుందని సింధియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన అభినందించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి పోలవరం వరకు

రాష్ట్ర అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కుదేలైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర సహకారంతో కాపాడుకున్నాం. ఇప్పుడు అది లాభాల బాట పట్టిందని జనవరిలోనే రూ.54 కోట్ల లాభం గడించడం సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రం డబుల్ స్పీడ్‌తో ముందుకు వెళ్తోందని ధీమా వ్యక్తం చేశారు.

దేశ పరువు తీయడం తగదు.. ప్రతిపక్షాలపై విమర్శలు

ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో భారత సాంకేతికతను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటుంటే యూత్ కాంగ్రెస్ నేతలు అర్థనగ్న ప్రదర్శనలు చేయడం దురదృష్టకరమని సీఎం మండిపడ్డారు. రాజకీయాల కోసం దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలన్న ప్రధాని మోదీ ఆశయ సాధనలో ప్రతి డాక్ సేవకుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.