
డేవిస్ కప్ క్వాలిఫయర్స్కు భారత్
భారత పురుషుల టెన్నిస్ జట్టు చరిత్ర సృష్టించింది. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-1లో స్విట్జర్లాండ్ను వారి సొంత గడ్డపైనే 3-1 తేడాతో ఓడించి, 2026 డేవిస్ కప్ క్వాలిఫయర్స్లో చోటు సంపాదించుకుంది. దాదాపు 32 ఏళ్ల తర్వాత భారత్ ఒక యూరోపియన్ దేశంపై వారి సొంత గడ్డపై విజయం సాధించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1993లో ఫ్రాన్స్పై విజయం సాధించింది. కాగా ఈ విజయంలో స్టార్ ఆటగాడు సుమిత్ నాగల్ కీలక పాత్ర పోషించాడు.
సుమిత్ నాగల్ అద్భుత ప్రదర్శన
భారత జట్టు విజయంలో సుమిత్ నాగల్ హీరోగా నిలిచాడు. సింగిల్స్లో రెండు విజయాలతో భారత్కు కీలకమైన 2 పాయింట్లను అందించాడు. మొదటి సింగిల్స్ మ్యాచ్లో నాగల్.. మార్క్ ఆండ్రియా హ్యూస్లర్ను 6-3, 7-6(4) తేడాతో ఓడించి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అదే రోజు జరిగిన మరో సింగిల్స్ మ్యాచ్లో దక్షిణేశ్వర్ సురేష్ అద్భుతంగా ఆడి జెరోమ్ కిమ్ను ఓడించి భారత్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు.
ఇక డబుల్స్ మ్యాచ్లో భారత జోడీ ఎన్. శ్రీరామ్ బాలాజీ, రిత్విక్ బొలిపల్లి స్విస్ జోడీ జాకుబ్ పాల్, డొమినిక్ స్ట్రైకర్ చేతిలో 6-7(3), 6-4, 7-5 తేడాతో ఓడిపోయారు. దీంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది, మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే నిర్ణయాత్మకమైన నాలుగో సింగిల్స్ మ్యాచ్లో సుమిత్ నాగల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి యువ హెన్రీ బెర్నెట్ను 6-1, 6-3 తేడాతో సులభంగా ఓడించి భారత్కు విజయాన్ని అందించాడు.
భారత జట్టు ఈ విజయం సాధించడం వెనుక జట్టు కృషి, నాయకత్వం, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు ఉన్నాయి. సుమిత్ నాగల్ ఈ విజయం గురించి మాట్లాడుతూ, ‘పదాలలో వర్ణించలేని ఒక గొప్ప అనుభూతి ఇది. 32 సంవత్సరాల తర్వాత భారత్ యూరప్లో డేవిస్ కప్ విజయాన్ని సాధించడంలో జట్టు కృషి అసాధారణం. ఈ విజయం పట్ల గర్వపడుతున్నాను’ అని అన్నాడు. కాగా డేవిస్ కప్ ర్యాంకింగ్స్లో 37వ స్థానంలో ఉన్న భారత్, 24వ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ను ఓడించి 2026 వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించడం భారత టెన్నిస్ జట్టుకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
