
డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యం
యువత పూర్తిగా డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆదివారం ఉదయం డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నమో యువ 3కే రన్‌ను ఆయన ప్రారంభించారు. భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పరుశురామ్ రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ భారతదేశం వికసిత భారత్ వైపు అడుగులు వేసేటువంటి అమృతకాలం తరుణంలో యువత తప్పుదారి పట్టకుండా ఉండాలని అన్నారు.
గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఉండాలని, రాబోయే 2047 సంవత్సరానికి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా ఉండాలంటే ఆ బాధ్యతను యువత ముందుండి నడిపించాలని, అలాగే భారతదేశ యువత ప్రపంచంలో అగ్రగామి కంపెనీలకి అధిపతులుగా ఎదిగారని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా యువత వారి స్నేహితులు, బంధువులు మిత్రులు ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైనట్లు కలిసి ఉంటే వారిలో కచ్చితంగా మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇందుకోసమే నమో యువ 3కే రన్ నిర్వహిస్తున్నామని, ఈ పరుగు దేశ అభివృద్ధి వైపు యువత పరుగులెత్తించే లాగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రమోహన్, కోశాధికారి నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుష్, మీడియా ఇంచార్జ్ కోటేశ్వరావు, యువమోర్చా నాయకులు ధోని నాగరాజు, వంశీ యాదవ్, కొండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
