
డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన అమెరికా
ప్రపంచ ఆరోగ్య రక్షణలో దశాబ్దాలుగా కీలక భూమిక పోషిస్తున్న అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అధికారికంగా వైదొలిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది క్రితం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం గురువారంతో పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. 1948లో ఈ సంస్థ ఆవిర్భావంలో అగ్రరాజ్యం ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు 78 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చేయనుంది.
నిష్క్రమణకు కారణం 'కోవిడ్' వైఫల్యాలే!
కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడంలో డబ్ల్యూహెచ్‌ఓ ఘోరంగా విఫలమైందన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. సంస్థలో అత్యవసర సంస్కరణలు చేపట్టలేకపోయిందని, చైనా వంటి కొన్ని సభ్య దేశాల రాజకీయ ప్రభావాలకు లోనై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిందని అమెరికా ధ్వజమెత్తింది. ఈ కారణాలతోనే సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా ఫెడరల్ అధికారులు స్పష్టం చేశారు.
బకాయిల రగడ: 130 మిలియన్ డాలర్ల వివాదం
అమెరికా నిష్క్రమణ ప్రక్రియ ముగిసినా, ఆర్థిక లావాదేవీల వివాదం ఇంకా సద్దుమణగలేదు. 2024, 2025 సంవత్సరాలకు సంబంధించి అమెరికా సుమారు 130 మిలియన్ డాలర్ల సభ్యత్వ రుసుమును బాకీ ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అయితే, తాము సభ్యత్వమే రద్దు చేసుకున్నందున ఆ బకాయిలు చెల్లించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత తమపై లేదని ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా ఏటా సగటున 111 మిలియన్ డాలర్ల సభ్యత్వ రుసుముతో పాటు, 570 మిలియన్ డాలర్ల స్వచ్ఛంద విరాళాలను అందించే అతిపెద్ద దాతగా ఉండేది.
డబ్ల్యూహెచ్‌వో పాత్ర..
ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక ఆరోగ్య సంస్థగా డబ్ల్యూహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎబోలా, పోలియో, ఎమ్‌పాక్స్ వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు గ్లోబల్ స్థాయిలో స్పందనను సమన్వయం చేయడం దీని బాధ్యత. పేద దేశాలకు సాంకేతిక సాయం, వ్యాక్సిన్లు, మందుల పంపిణీకి తోడ్పడటంతో పాటు.. మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ వంటి వందలాది వ్యాధులపై అంతర్జాతీయ మార్గదర్శకాలను రూపొందించి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ఇది దిశానిర్దేశం చేస్తుంది.
నిపుణుల హెచ్చరిక
ప్రజారోగ్య నిపుణులు ఈ నిర్ణయాన్ని వినాశకరమైనదిగా అభివర్ణిస్తున్నారు. అగ్రరాజ్యం నిష్క్రమణ వల్ల కొత్త మహమ్మారులపై ముందస్తు హెచ్చరికలు పొందే అవకాశం కోల్పోతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక కమిటీల నుంచి తప్పుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే 'ఫ్లూ' వైరస్ రకాలపై కీలక సమాచార మార్పిడి నిలిచిపోతుంది. ఏటా అప్‌డేట్ చేసే ఫ్లూ వ్యాక్సిన్ల తయారీకి ఈ డేటా ఎంతో కీలకం. ఇది లేకపోతే అమెరికా ఫార్మా కంపెనీలు ప్రభావవంతమైన టీకాలను రూపొందించడంలో వెనుకబడే ప్రమాదం ఉంది.
చిక్కుల్లో ఆరోగ్య పథకాలు
డబ్ల్యూహెచ్‌ఓ మధ్యవర్తిత్వం లేకుండా ఇతర దేశాలతో నేరుగా డేటా పంచుకునేలా ఒప్పందాలు చేసుకుంటామని ట్రంప్ సర్కారు చెబుతున్నా, అది ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకమే. చైనా, ఆఫ్రికా దేశాలు తమ డేటాను అమెరికాకు నేరుగా ఇస్తాయా అన్నది సందేహమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిష్క్రమణ వల్ల పోలియో నిర్మూలన, మాతా-శిశు సంరక్షణ పథకాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా, కాంగ్రెస్ ఆమోదం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో చట్టపరమైన వివాదాలకు కూడా దారితీయవచ్చు.
