Let's talk: editor@tmv.in
డబ్ల్యూపీఎల్‌లో ముంబైపై యూపీ వారియర్స్ విజయం

డబ్ల్యూపీఎల్‌లో ముంబైపై యూపీ వారియర్స్ విజయం

Pinjari Chand
18 జనవరి, 2026

మహిళల ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో యూపీ వారియర్స్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్‌జ్‌ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్‌ (70), ఆస్ట్రేలియా సహచరురాలు ఫీబీ లిచ్‌ఫీల్డ్‌ (61) అర్ధశతకాలతో మెరిశారు. యూపీ జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 76 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ముంబై బౌలర్లను పూర్తిగా నిరాశపరిచారు. నిర్ణీత 20 ఓవర్లలో యూపీ వారియర్స్ 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్‌ (13), సజీవన్‌ సజనా (10) త్వరగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నాట్ స్కివర్-బ్రంట్‌ (15), నికోలా కేరీ (6) కూడా విఫలమయ్యారు. 10 ఓవర్లకే ముంబై 62/4 స్కోరుతో కష్టాల్లో పడింది. మధ్యలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ (18) కూడా అవుట్ కావడంతో ముంబై ఆశలు మరింత తగ్గాయి. అయితే అమన్ జోత్ కౌర్‌ (41) – అమెలియా కెర్‌ (49 నాటౌట్) జోడీ ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించి పోరాటం కనబరిచింది. అయినప్పటికీ అది సరిపోలేదు. ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులకే పరిమితమైంది. యూపీ బౌలర్లలో శిఖా పాండే 2/30తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ముంబై తరఫున అమెలియా కెర్‌ (3/28), నాట్ స్కివర్-బ్రంట్‌ (2/22) వికెట్లు తీశారు. అయితే ముంబై ఫీల్డింగ్‌లో కనీసం ఐదు క్యాచ్‌లు వదలడం ఓటమికి కారణమైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌లలో యూపీ వారియర్స్ రెండో మ్యాచ్ లు గెలిచింది. ముంబైకి ఇది మూడో పరాజయం.