Let's talk: editor@tmv.in
డబ్ల్యూటీసీలో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్

డబ్ల్యూటీసీలో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్

Shaik Mohammad Shaffee
12 అక్టోబర్, 2025

భారత క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘనత నమోదైంది. టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ (129 నాటౌట్) బాదిన గిల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక శతకాలు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.

గిల్ అరుదైన రికార్డులు

శుభ్‌మన్ గిల్ డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 10 శతకాలు నమోదు చేసి, ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు తొమ్మిది సెంచరీలతో రోహిత్ శర్మ పేరిట ఉండేది. అంతేకాదు 71 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలతో 2,826 పరుగులు చేసి, డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఈ క్రమంలో రిషభ్ పంత్ (2731 పరుగులు, 6 సెంచరీలు)ను గిల్ అధిగమించాడు.

కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది ఐదో టెస్ట్ సెంచరీ. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో కెప్టెన్‌గా ఐదు టెస్ట్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ (2017, 2018) రికార్డును గిల్ సమం చేశాడు. కెప్టెన్‌గా అత్యంత వేగంగా (12 ఇన్నింగ్స్‌ల్లో) ఐదు శతకాలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. సునీల్ గవాస్కర్ (10 ఇన్నింగ్స్‌లు) మాత్రమే గిల్ కంటే ముందున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (13 ఇన్నింగ్స్‌లు)ను కూడా గిల్ అధిగమించడం విశేషం. 26 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో గిల్ ఖాతాలో ఇప్పుడు 19 శతకాలు నమోదయ్యాయి.

జడేజా తీన్మార్.. విండీస్ బేజార్

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518 పరుగుల భారీ స్కోరు వద్ద ఐదు వికెట్లకు డిక్లేర్ చేసిన తర్వాత, వెస్టిండీస్‌ను రెండో రోజు ఆట ముగిసే సమయానికి 140 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయేలా చేసింది.

స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/37), కుల్దీప్ యాదవ్ (1/45) బంతితో అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. ఈ ఇద్దరు కలిసి నాలుగు వికెట్లు పంచుకున్నారు. వెస్టిండీస్ ఇంకా భారత్ స్కోరు కంటే 378 పరుగుల వెనుకబడి ఉంది. ఆట ముగిసే సమయానికి షాయ్ హోప్ (31 నాటౌట్), తెవిన్ ఇమ్లాచ్ (14 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518 పరుగుల వద్ద ఐదు వికెట్లకు డిక్లేర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 175 పరుగులు (258 బంతుల్లో) చేయగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 129 పరుగులు (196 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించారు. భారత స్పిన్ ద్వయం ప్రదర్శన చూస్తుంటే, మూడో రోజు ఆటలో వెస్టిండీస్‌ త్వరగా ఆలౌట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.