
‘డబుల్ స్పీడ్’తో దూసుకుపోతున్న ఒడిశా
పద్దెమినిది నెలలకు ముందుగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకుని ఒడిశా ప్రజలు అభివృద్ధిని స్వాగతించారని, దీంతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త ప్రాజెక్ట్ లతో డబుల్ ఇంజన్ వేగంతో రాష్ట్రం ముందుకు వెళుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఆయన ఒడిశాలోని జార్సుగూడలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
50 వేల పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం
ఒడిశా ప్రజల సామర్థ్యం, ప్రతిభ పై నాకు నమ్మకం ఉంది. వారికి ప్రకృతి ఎన్నో వనరులను బహుమతిగా ఇచ్చింది. ఇక్కడి ప్రజలు దశాబ్దాల పాటు పేదరికంలో గడిపారు. రాబోయే కాలంలో ఇక్కడి ప్రజలు శ్రేయస్సు వైపు పయనిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మా డబుల్ ఇంజిన్ సర్కార్ ఒడిశాకు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకొస్తుందన్నారు. కేంద్రం ఇటీవల ఇక్కడ రెండు సెమీ కండక్టర్ యూనిట్లను నెలకోల్పడానికి ఆమోదం తెలిపింది. అలాగే ఇక్కడి పేదలు, అణగారిన వర్గాల ప్రజల కోసం దాదాపు 50,000 పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
పేదలకు , దళితులకు, వెనుకబడిన వారికి, గిరిజనులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకే దేశంలో దాదాపు 4 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చే పనిలో నిమగ్నమైంది. దీని ద్వారా భవిష్యత్ తరాల వారికి కూడా భరోసా ఉంటుందన్నారు. ఇక్కడ కూడా పక్కా ఇండ్లు నిర్మించి ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తామన్నారు.
నౌకా నిర్మాణంతో అనేక ప్రయోజనాలు
అలాగే ఇక్కడే వస్తు ఉత్పత్తి జరగాలని చిప్ నుంచి షిప్ వరకు ఇక్కడే జరగాలన్నది మా సంకల్పం. ఆర్థికంగా బలంగా ఉండాలనుకునే ఏ దేశమైనా నౌకానిర్మాణానికి ప్రాముఖ్యత ఇస్తుంది. అది వాణిజ్యం, సాంకేతికత, జాతీయ భద్రత ఇలా ప్రతి రంగంలోనూ నౌకానిర్మాణం ప్రయోజనాలను అందిస్తుందన్నారు. సొంత నౌకలు ఉంటే, సంక్షోభ సమయాల్లో ప్రపంచంతో దిగుమతులు , ఎగుమతులలో ఇబ్బంది ఉండదని తెలిపారు. అందుకే నౌకనిర్మాణ పరిశ్రమకు ఇటీవల 70,000 వేల కోట్ల ప్యాకేజీని ఇచ్చామని ప్రస్తావించారు.
నవరాత్రి ఉత్సవాల సమయంలో ఇక్కడున్న మా సామలేయి మా రామచండీ దేవిని దర్శించుకోవడం తన అదృష్టమని ప్రధానమంత్రి అన్నారు. సుమారు 60 వేల కోట్లకు పైగా ప్రారంభించిన ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం మోహన్ చరణ్ మాఝీ, గవర్నర్ హరిబాబు హజరయ్యారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలను ప్రారంభించారు. కొత్త సెమీకండక్టర్ యూనిట్లకు ఆమోదం తెలిపారు.
