Let's talk: editor@tmv.in
డబుల్ బెడ్‌రూమ్ కాలనీలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: హన్మకొండ జిల్లా కలెక్టర్

డబుల్ బెడ్‌రూమ్ కాలనీలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: హన్మకొండ జిల్లా కలెక్టర్

Gaddamidi Naveen
22 ఫిబ్రవరి, 2026

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు నాణ్యమైన జీవన ప్రమాణాలు, మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. స్నేహ శబరీష్ పేర్కొన్నారు. ఆమె జిల్లాలోని న్యూ శాయంపేట అంబేడ్కర్ నగర్‌లలోని డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీలో భాగంగా కలెక్టర్ కాలనీల అంతటా కలియతిరిగి, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ నివాసితులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ, నీటి వసతిపై నివాసితుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.

డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటూ, వెంటనే మరమ్మతులు చేపట్టాలని హౌసింగ్, ఆర్ & బి, మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులను వేగవంతం చేయాలని, వర్షాకాలానికి ముందు అన్ని పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగు నీటి పారుదల వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందేలా చర్యలు తీసుకుని, డబుల్ బెడ్‌రూమ్ కాలనీలను ఆదర్శవంతమైన నివాస ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.

డబుల్ బెడ్‌రూమ్ కాలనీలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: హన్మకొండ జిల్లా కలెక్టర్ - Tholi Paluku