
డిజిటల్ ప్రజాస్వామ్యానికి శ్రీకారం!
నేపాల్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయంగా మారాయి. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జెన్ జడ్ ఆగ్రహావేశాలతో ప్రారంభించిన ఉద్యమంతో ఏకంగా ప్రభుత్వమే కుప్పకూలిపోయింది. ప్రధాని సహా, హోంమంత్రి రాజీనామా అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి బాధ్యతలు చేపట్టారు. నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎన్నిక ఆసక్తికరంగా జరిగింది. జెన్ జడ్ తమ నాయకుడిని ఎన్నుకోవడానికి 'డిస్కార్డ్' అనే సోషల్ మీడియా వేదికను వినియోగించారన్న ప్రచారంతో ఈ యాప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన రానప్పటికీ డిజిటల్ వేదిక ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.
ప్రారంభించిన ఏడాదిలోనే వృద్ధిలోకి
డిస్కార్డ్ అనే యాప్ను 2015లో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గేమర్ల మధ్య ఆట నిలిపివేయకుండా సంభాషణ కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు. ఈ యాప్ను స్టానిస్లావ్ విష్నెవ్స్కీ, జేసన్ సిట్రోన్ అనే ఇద్దరు వ్యక్తులు అందుబాటులోకి తీసుకొచ్చారు. యాప్ ప్రారంభించిన తర్వాత సంవత్సరంలోపే డిస్కార్డ్ ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా వినియోగదారులను సంపాదించుకుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో జెన్ జడ్ ఈ యాప్ను ఎక్కువగా వినియోగించినట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో ఎన్నో రంగాలకు ఎదురుదెబ్బ తగిలినా డిస్కార్డ్ మాత్రం భారీగా వృద్ధి చెందింది. ఇది కేవలం గేమింగ్ కోసం మాత్రమే కాకుండా వ్యక్తిగత సంభాషణల కోసం, సామూహిక చర్చల కోసం కూడా వినియోగిస్తున్నారు. ఇందులో వేర్వేరు విషయాలపై ప్రత్యేక ఛానళ్లతో కూడిన సర్వర్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ఆసక్తి ఉన్న అంశాలపై సర్వర్ల సృష్టి
మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేసి డిస్కార్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఖాతా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఆసక్తి ఉన్న అంశాలపై సర్వర్లను జాయిన్ కావచ్చు. ఇందులో మీ అభిరుచికి తగినట్లు కొత్త సర్వర్లు కూడా సృష్టించుకోవచ్చు. ప్రతి సర్వర్ ఒక పెద్ద కమ్యూనిటీగా పని చేస్తుంది. ఇందులో సందేశాలు, వీడియోలు, ఫోటోలు ఇలా అనేక రకాల సమాచారాన్ని పంచుకోవచ్చు. ఒక్కో సర్వర్లో గరిష్ఠంగా 5 లక్షల మంది సభ్యులుగా చేరవచ్చు. కానీ, ఏక కాలంలో 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్గా ఉండగలరు.
నేపాల్ ప్రధాని ఎన్నిక జరిగిందిలా!
నేపాల్లో ఈ యాప్ వినియోగం ఎక్కువగానే ఉంది. ప్రభుత్వ అవినీతిపై తమ గళం వినిపించేందుకు జెన్ జడ్ యువత డిస్కార్డ్నే వేదికగా చేసుకున్నారు. ఇందులో 'యూత్ అగేనెస్ట్ కరప్షన్' అనే సర్వర్ రూపొందించారు. ఈ వేదిక నుంచి తమ ప్రచారాలు, చర్చలు, ప్రకటనలు కొనసాగించారు. ఈ సర్వర్లో సుమారు 1.45 లక్షల మందికి పైగా సభ్యులు నమోదయ్యారు. ఇక నేపాల్ తాత్కాలిక ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియను కూడా ఈ యాప్లోనే చేపట్టారు. ప్రధానంగా ఈ పదవికి ముగ్గురిని పరిశీలించారు. వీరిలో నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ, మాజీ విద్యుత్ అధికారి కుల్మన్ ఘీసింగ్, ర్యాపర్ బాలేంద్ర షా పేర్లు బలంగా వినిపించాయి. ఒకానొక సమయంలో కుల్మన్ను దాదాపుగా ఖరారు చేశారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని ప్రచారం జరిగింది. కానీ, తర్వాత సుశీలను తాత్కాలిక ప్రధానిగా ప్రకటించారు. జెన్ జడ్ ఉద్యమం కోసం రూపొందించిన 'యూత్ అగేనెస్ట్ కరప్షన్' సర్వర్లో ప్రధాని ఎన్నిక కోసం అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఓటింగ్, పోల్స్ నిర్వహించారు. ఇందులో దాదాపు 1.35 లక్షల మంది పాల్గొనట్లు తెలుస్తోంది. వీరిలో 50 శాతం మంది తాత్కాలిక ప్రధానిగా ఎటువంటి అవినీతి మరక లేని సుశీలకే జై కొట్టారు. అయితే ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారంతా నేపాల్కు చెందిన వారేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాప్ పని తీరు దృష్టా ఇతర దేశాల వారు కూడా సర్వర్లో చేరి ఓటింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా యూజర్లు
డిస్కార్డ్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. దీనికి ప్రముఖ దేశాల్లో కోట్లాది వినియోగదారులున్నారు. అత్యధికంగా అమెరికాలో 25 కోట్ల వరకు ఉన్నారు. బ్రెజిల్తో పాటు భారత్లో సుమారు 5 కోట్లకు పైగా ప్రజలు ఈ యాప్ వాడుతున్నారు. చైనా, సింగపూర్, కెనడా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో సైతం విస్తృతంగా దీన్ని వినియోగిస్తున్నారు. డిస్కార్డ్ విండోస్, మాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో 30కి పైగా విభిన్న భాషల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి డిస్కార్డ్లో తెలుగు భాష లేదు. వినియోగదారులు పెరిగితే తెలుగును సైతం అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
నేపాల్లో ప్రజాస్వామ్యం కొత్త రూపం దాల్చుతోంది. ఆన్లైన్ వేదికల ద్వారా అభిప్రాయాలను వెల్లడించడం సహజంగా అన్ని దేశాల్లో జరుగుతుంది. కానీ నాయకత్వాన్ని ఎంపిక చేయడం, భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ ప్రక్రియలు రాజకీయాలను ఆసక్తికర మార్పుల దిశగా నడిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత వినియోగించుకొని డిస్కార్డ్ వేదికగా యువత నిర్ణయాలు తీసుకుంటే అది రాజకీయాల్లో పెను మార్పులను తీసుకురావడం ఖాయం.
