
డీఎంకే ప్రభుత్వంపై అన్నామలై ఫైర్
మన పిల్లలు చదివే పాఠశాలలు సరిగా లేవు. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. బడికి పోయిన వారు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారో లేదోననే సందేహాలు డీఎంకే ప్రభుత్వంలో ఎక్కువయ్యాయని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. సోమవారం తిరుచ్చి జిల్లాలో తూరైయ్యూర్ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాల పై కప్పు కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అన్నామలై డీఎంకే ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమిళనాడులోని కూలిపోయిన పాఠశాలలకు లెక్కేలేదని అన్నారు. ఈ ప్రభుత్వం తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. విద్యాశాఖమంత్రి సొంత జిల్లాలోనే పాఠశాలల పరిస్థితి ఈ విధంగా ఉందని దుయ్యబట్టారు. వారి అవినీతికి మన పిల్లలు బలవ్వాల్సిందేనా? అని ప్రశ్నించారు. అలాగే సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశారు.
కాంట్రాక్టర్లపై చర్యలేవీ?
తమిళనాడులో ఇప్పటి వరకు చాలా పాఠశాలల పై కప్పులు కూలిపోయాయని వాపోయారు. మరి ఈ పాఠశాలలు నిర్మించిన కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. నిర్మాణ సమయంలో పనులను పర్యవేక్షించింది ఎవరు? వారికి ఏ ప్రాతిపదికన కాంట్రాక్ట్ కట్టబెట్టారు. డీఎంకే ప్రభుత్వంపై ఎందుకు మౌనంగా ఉంది. వారి అవినీతిలో మీకు వాటా ఉన్నందుకే చూస్తు ఉన్నారా? ప్రభుత్వ పాఠశాలలు కూలిపోతున్న పట్టింపులేదా? అలాగే పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఆడ్మిషన్లు తగ్గుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు. మీ మంత్రుల ప్రైవేట్ పాఠశాలలు ఫుల్ కావడానికేనా అని ప్రశ్నించారు. వీటన్నింటిపై విద్యాశాఖ మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తప్పిన ప్రమాదం
సింగలంతపురంలోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ సుమారుగా 34 విద్యార్థులు చదువుకుంటున్నారు. దాదాపు రూ.30 లక్షల వ్యయంతో పాఠశాల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండు గదుల్లో బోధనా తరగతులు నడుస్తున్నాయి. పాఠశాల పై కప్పు కూలిన ఘటనలో ఈరోజు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు పాఠశాల గదిని తెరవగా అది కూలిపోయింది. శిథిలాలు బెంచీలు, టీవీలపై పడడంతో అవి ధ్వంసమయ్యాయి. విద్యార్థులు ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే ఎంత నష్టం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మౌలిక సదుమపాయాల కల్పన విషయంలో సందేహలు రేకేత్తిస్తున్నాయి.
