Let's talk: editor@tmv.in
డంపింగ్ యార్డ్ వద్దు - ప్రజాభిప్రాయమే ముద్దు: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

డంపింగ్ యార్డ్ వద్దు - ప్రజాభిప్రాయమే ముద్దు: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Gaddamidi Naveen
14 ఏప్రిల్, 2026

హుజురాబాద్ పట్టణ పరిధిలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌ అంశంపై రాజకీయం వేడెక్కింది. దీనికి వ్యతిరేకంగా గత 22 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షకు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ హుజురాబాద్ క్లబ్ సభ్యులు చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలు మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 500 ఎకరాల భూమిని సేకరించి ఇక్కడ వ్యర్థాలను కుమ్మరించాలని చూడటం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి చేటు చేస్తుందని హెచ్చరించారు. ప్రజలే డంపింగ్ యార్డ్ కోరుకుంటున్నారని సుడా చైర్మన్ చెబుతున్న మాటల్లో నిజం లేదని, గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

ఈ యార్డ్ వల్ల చుట్టుపక్కల ఉన్న 9 మండలాల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, పర్యావరణం కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ ప్రాంతాల ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో లక్ష మందితో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాము ఈ ప్రాజెక్టుకు అంగీకరించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని, నిరూపించలేకపోతే ఆరోపణలు చేసిన వారు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు.

ఈ నెల 19న డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత ప్రాంతంలోని ఐలోని దేవాలయంలో నిర్వహించనున్న మల్లన్న పట్నాలు కార్యక్రమానికి ప్రజలందరూ భారీగా తరలిరావాలని కోరారు. భక్తి కార్యక్రమంతో పాటు ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేసే వరకు విశ్రమించేది లేదని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.