
డంపింగ్ యార్డ్ తొలగించే వరకు పోరాటం ఆగదు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష బుధవారం ఉదయం విజయవంతంగా ముగిసింది. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు తన పోరాటం ఆగదని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష బుధవారం ఉదయం 10 గంటలకు ముగిసింది. కౌశిక్ రెడ్డి నిమ్మరసం సేవించి దీక్షను విరమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రాజెక్టులను ప్రభుత్వం బలవంతంగా అమలు చేయాలని ప్రయత్నించడం అనైతికమని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యంగా ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నాయకులు కలసి ప్రజల తరఫున ముందుకు రావాలని కోరారు. అఖిలపక్షం ఏకమైతే తాను వారి వెనుక నిలబడి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే లక్ష మందితో భారీ ధర్నా నిర్వహిస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. పది రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే నియోజకవర్గంలోని 107 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన చెప్పారు. ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ, నాపై కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయండి కానీ ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దు అని అన్నారు. తాను ఉన్నంతవరకు డంపింగ్ యార్డ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనివ్వనని, అవసరమైతే ప్రాణాలకైనా తెగించి పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు.
ఇక ఈ దీక్షకు హుజురాబాద్ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. దీక్ష విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కౌశిక్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.
