Let's talk: editor@tmv.in
డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్ విజయవంతం

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్ విజయవంతం

Gaddamidi Naveen
4 ఏప్రిల్, 2026

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జేఏసీ పిలుపునిచ్చిన బంద్ శుక్రవారం విజయవంతమైంది. ఈ నిర్ణయానికి నిరసనగా పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.

బంద్ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ వీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా, దేశానికే నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసే ఈ ప్రాంతంలోని సారవంతమైన వ్యవసాయ భూములు డంపింగ్ యార్డ్ వల్ల కలుషితమై, నాశనం అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య కేవలం ఒక్క పార్టీకి సంబంధించింది కాదని, ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే, భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయ‌న హెచ్చరించారు.

రాబోయే కార్యాచరణ

నిరసన సెగను కొనసాగిస్తూ, ఈ నెల 7, 8 తేదీల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు రోజుల ధర్నా కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బంద్‌ను విజయవంతం చేయడంలో సహకరించిన వ్యాపారులు, రవాణా రంగాలు, అన్ని వర్గాల ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదన రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన పునరుద్ఘాటించారు.