
ఠాక్రేల వైరానికి ముం‘బై’
మున్సిపల్ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్సీపీ(శరద్ పవార్), ఎన్సీపీ(అజిత్ పవార్) ల మధ్య పుణే స్థానం విషయంలో చర్చలు జరిగాయి. ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయంపై సమావేశమయ్యారు. తాజాగా ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ వైరానికి తెరదించుతూ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం కూటమి ప్రకటించారు. జనవరి 15న జరగనున్న ఆర్థికంగా అత్యంత కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలే లక్ష్యంగా ఈ పొత్తు కుదిరింది. వర్లీ లోని ఓ హోటల్‌లో జరిగిన 16 నిమిషాల సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ వేదిక ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే నియోజకవర్గ పరిధిలో ఉండడం గమనార్హం.
ఈ కలయికను మహారాష్ట్ర పట్ల తమ కర్తవ్యంగా అభివర్ణించిన ఠాక్రే సోదరులు, ‘మరాఠీ మనూస్’ ఓట్ల ఏకీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అధికార మహాయుతి కూటమికి ఎదురుగా నిలవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ముంబై మేయర్ తప్పకుండా మరాఠీయే… అది మనవాడే అని రాజ్ ఠాక్రే ప్రకటించారు. 25 ఏళ్లుగా అవిభాజ్య శివసేన పాలనలో ఉన్న బీఎంసీని తిరిగి చేజిక్కించుకోవాలనే ఉమ్మడి ప్రయత్నానికి ఇది సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన సీట్ల పంపకం ఖరారైందని ఉద్ధవ్ తెలిపారు. జనవరి 15న బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని 27 ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఎంసీ విషయంలో సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదన్న సంకేతాలు కనిపించాయి. కొన్ని వార్డులపై ఇరు పార్టీల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మహాయుతి విమర్శలు
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఈ పొత్తును తీవ్రంగా విమర్శించింది. ఇది రాజకీయ మనుగడ కోసం చేసిన ఆఖరి ప్రయత్నం అని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. మీడియా ఈ కలయికను రష్యా–ఉక్రెయిన్ కూటమిలా చూపిస్తోంది. కానీ వీరి చరిత్ర అవినీతి, స్వార్థ రాజకీయాలే. దీని వల్ల పెద్దగా రాజకీయ ప్రభావం ఉండదు అని ఎద్దేవా చేశారు. బీఎంసీలో 25 ఏళ్ల పాలనపై ఉద్ధవ్ సమాధానం చెప్పాల్సిందే. పాత పాపాలు తుడిచిపెట్టలేం అని ఆయన అన్నారు.
బీజేపీ, శిండే విమర్శలు
ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఈ కలయికను అధికారం కోసమే అంటూ విమర్శించారు.
బీజేపీ నేత అశీష్ షెలార్, గతంలో విడిపోయినప్పుడు ఉద్ధవ్‌పై రాజ్ చేసిన విమర్శలను గుర్తు చేశారు. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ, ఇది రెండు వంశాల రాజకీయ కలయిక. ముంబై ప్రజలు ఎన్డీఏ–బీజేపీ అభివృద్ధినే కోరుకుంటున్నారు అన్నారు.
ఠాక్రే కుటుంబ నేపథ్యం
2005లో బాల్ ఠాక్రే వారసత్వ అంశంలో విభేదాలు తలెత్తడంతో రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వచ్చారు. బాల్ ఠాక్రేపై అపారమైన గౌరవం ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ ఉన్న వర్గంతో కలిసి పనిచేయలేనని అప్పట్లో రాజ్ చెప్పారు. విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే, 1950ల నాటి ‘సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం’లో ఠాక్రే కుటుంబం పోషించిన పాత్రను గుర్తుచేశారు. తమ తాత ప్రబోధంకర్ ఠాక్రే, తండ్రి బాల్ ఠాక్రే, రాజ్ తండ్రి శ్రీకాంత్ ఠాక్రే—ముంబై మహారాష్ట్రలో భాగంగా ఉండేందుకు కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు.
కుటుంబ ఐక్యత ప్రదర్శన
విలేకరుల సమావేశానికి ముందు ఇద్దరూ శివాజీ పార్క్‌లోని బాల్ ఠాక్రే స్మారకాన్ని సందర్శించారు. అనంతరం రాజ్ కారులో కలిసి సమావేశానికి వెళ్లారు. ఉద్ధవ్ భార్య రష్మి, కుమారుడు ఆదిత్య, రాజ్ భార్య శర్మిల, కుమారుడు అమిత్ కూడా హాజరై కుటుంబ ఐక్యతను చాటారు.
గత ఎన్నికల ప్రభావం
2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 94 సీట్లకు పోటీ చేసి కేవలం 20 మాత్రమే గెలుచుకుంది. ఎంఎన్‌ఎస్ 125 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటూ గెలవలేదు. ఈ పరాజయాల అనంతరం, జూలైలో హిందీని 1 నుంచి 5 తరగతులకు ప్రవేశపెట్టే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలిపిన నిరసనలో ఇరు పార్టీలు దగ్గరయ్యాయి.
అజిత్ పవార్ ఎన్సీపీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సుప్రియా సూలే
పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకునే అంశంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలలో ఉన్న అన్ని అనుమానాలు, భయాలు తొలగేవరకు పొత్తుకు ముందుకు వెళ్లబోమని ఆమె తేల్చిచెప్పారు. బుధవారం పుణెలో మీడియాతో మాట్లాడిన సూలే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో సంప్రదింపులు జరుగుతున్నాయని అంగీకరించారు. అయితే రెండు ఎన్సీపీ వర్గాలు కలిసి పోటీ చేస్తే వచ్చే రాజకీయ ప్రభావాలపై కూడా లోతైన చర్చ అవసరమని తెలిపారు.
స్థానిక నేతల ఆందోళనలపై వివరణ
జనవరి 15న జరగనున్న పుణె కార్పొరేషన్ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీతో పొత్తు అంశంపై తమ పార్టీ నగర అధ్యక్షుడు ప్రశాంత్ జగ్తాప్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని సూలే ప్రస్తావించారు. ఈ అంశంపై తాను జగ్తాప్‌తో సుదీర్ఘంగా మాట్లాడి, ఆయన ఆందోళనలను పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. జగ్తాప్ ఆందోళనలు పూర్తిగా న్యాయమైనవే. ఆయన అడిగిన ప్రశ్నలు సమంజసమైనవే అని సూలే అన్నారు. పొత్తు కుదిరితే పార్టీ సిద్ధాంతాలు లేదా విధానాల్లో ఎలాంటి రాజీ ఉండదని జగ్తాప్‌కు హామీ ఇచ్చినట్లు చెప్పారు.
రాజకీయాల్లో మార్పులు సహజం
గత రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ, సోనియా గాంధీ విదేశీ మూలాల అంశాన్ని లేవనెత్తిన తర్వాత శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని, ఆ సందర్భంలోనే ఎన్సీపీ ఏర్పడిందని సూలే గుర్తుచేశారు. తరువాత యూపీఏ ప్రభుత్వంలో చేరేందుకు సోనియా గాంధీ రాజకీయ ఉదారత చూపారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. పొత్తు కుదిరినా మా పార్టీ సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదని సూలే స్పష్టం చేశారు. అయితే పొత్తుపై చర్చలను మాత్రం ఆమె కొట్టిపారేయలేదు.
