Let's talk: editor@tmv.in
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్

Gaddamidi Naveen
30 జులై, 2026

హైదరాబాద్‌లోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో సహచర మహిళా ట్రైనీని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచామ‌ని పోలీస్ వర్గాలు ధ్రువీకరించాయి. ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కోర్టు ఆదేశాలతో కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసుల భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తనను వేధింపులకు గురిచేస్తున్నాడని 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 18న ఈ 32 ఏళ్ల ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో మంగళవారం పోలీసులు ఆయనను విచారించారు. అయితే, కేసు నమోదైన తర్వాత సదరు నిందితుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు.

ఫిర్యాదు ప్రకారం, 30 ఏళ్ల మహిళా ట్రెయినీ ఐపీఎస్ అధికారి జూన్ 23 నుంచి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపుతూ, అకాడమీలో స్నేహితుల ముందు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. మరో ట్రైనీతో సంబంధం ఉందంటూ తనను ఒత్తిడికి గురిచేసి, అసభ్యంగా దూషించాడని పేర్కొన్నారు. జూలై 9న తనను బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడని, మెడపై కత్తి ఉంచి గది నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడని బాధితురాలు వివరించారు. తన అనుమతి లేకుండా రహస్యంగా వీడియా తీసి, తన భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేయడానికి యత్నించాడని వెల్లడించారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు మహిళపై నేరపూరిత బలాత్కార యత్నం, లైంగిక వేధింపులు, వెంటపడటం, మహిళా గౌరవానికి భంగం కలిగించడం తదితర భారతీయ నరసంహిత విభాగాలు, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితుడైన ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసినట్లు సమాచారం.

ట్యాగ్‌లు
HyderabadTelanganaIPSTraineeIPSPoliceCrimeNewsBreakingNewsSexualHarassmentLawAndOrderSVPNPAJusticeTeluguNews
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - Tholi Paluku