
ట్రేడ్ డీల్ భారత్‌కు వ్యతిరేకమే: కాంగ్రెస్
భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ఒప్పందం భారత్‌కు తీవ్ర వ్యతిరేకంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన హగ్‌లోమసీ, ఫోటో ఆప్స్ అన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనను ఉదహరిస్తూ, భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నదీ, లేనిది అమెరికా పర్యవేక్షిస్తుందని పేర్కొనడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ‘నామ్ నరేందర్, కామ్ సరెండర్’ అంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసింది.
కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్‌ఛార్జ్ జైరాం రమేశ్ మాట్లాడుతూ, తాజాగా విడుదలైన భారత్–అమెరికా సంయుక్త ప్రకటనలో కీలక వివరాలు లేకపోయాయని అన్నారు. కానీ ఇప్పటివరకు వెల్లడైన సమాచారం చూస్తే, కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్ ఇకపై రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోదు. అంతేకాకుండా, భారత్ రష్యా నుంచి నేరుగా లేదా పరోక్షంగా చమురు కొనుగోలు చేస్తే 25 శాతం జరిమానా సుంకాన్ని మళ్లీ విధించవచ్చని అమెరికా ప్రకటించిందని ఆయన ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. అమెరికా రైతులకు లబ్ధి చేకూర్చేలా భారత్ దిగుమతి సుంకాలను తగ్గించబోతుందని, దాని వల్ల భారత రైతులు నష్టపోతారని రమేశ్ ఆరోపించారు. అమెరికా నుంచి భారత్‌కు వచ్చే వార్షిక దిగుమతులు మూడింతలు పెరుగుతాయి. దీని వల్ల ఇప్పటివరకు ఉన్న వస్తువుల వాణిజ్య మిగులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఐటీ, ఇతర సేవల ఎగుమతులపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. భారత వస్తువుల ఎగుమతులు అమెరికాలో గతం కంటే ఎక్కువ సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
అన్ని ఆలింగనాలు, ఫోటో అవకాశాలు చివరకు ప్రయోజనం లేకుండానే పోయాయి. ‘నమస్తే ట్రంప్’పై ‘హౌడీ మోడీ’ ఓడిపోయింది. ‘దోస్త్ దోస్త్ నా రహా’, అంటూ 1964లో వచ్చిన ‘సంగమ్’ సినిమాలోని ప్రముఖ గీతాన్ని ఉదహరిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, ఈ వాణిజ్య ఒప్పందం ఇప్పటికీ కేవలం ఉద్దేశ్య ప్రకటన మాత్రమేనని, పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదని ఆయన అన్నారు. వచ్చే కొన్ని నెలల్లో వివరాలు బయటపడవచ్చని చెప్పారు. ప్రస్తుతం అమెరికాతో భారత్‌కు సుమారు 45 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. కానీ వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తామని ప్రకటించాం. అంటే సంవత్సరానికి కనీసం 100 బిలియన్ డాలర్ల దిగుమతులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మిగులు త్వరలోనే లోటుగా మారవచ్చు అని రమేశ్ తెలిపారు. ఈ ఒప్పందం పూర్తిగా భారత్‌కు వ్యతిరేకంగా ఉందనే భావన తనకు ఉందని ఆయన అన్నారు. ఒప్పందం భారత్ అభ్యర్థన మేరకే కుదిరిందని ట్రంప్ చేసిన ప్రకటన కూడా అదే సూచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ మాజీ సైన్యాధిపతి ఎం.ఎం. నరవాణే పుస్తకం అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ కు పాల్పడిందని కూడా ఆరోపించారు. ప్రధాని అయోమయానికి గురయ్యారు. పార్లమెంటులో లోక్‌సభకు రాలేదు. రాజ్యసభకు వచ్చి 97 నిమిషాల ఎన్నికల ప్రసంగం చేశారు. అందులో కాంగ్రెస్‌పై మాత్రమే మాట్లాడారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. ఈ వాణిజ్య ఒప్పందం భారత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లిందని మాత్రం చెప్పలేం. అమెరికా నుంచి దిగుమతులు పెరుగుతాయి. ఇది వంద శాతం ఖాయమని అన్నారు.
ఈ ఒప్పందం కొత్త అవకాశాలు కల్పిస్తాయి: ప్రధాని మోడీ
భారత్ అమెరికా శనివారం మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి ఒక రూపరేఖపై అంగీకరించినట్లు ప్రకటించాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించేందుకు పలు వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించేందుకు నిర్ణయించాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ, ఈ ఒప్పందం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుందని, రైతులు, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో వ్యక్తిగతంగా కృషి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్, అమెరికాలకు గొప్ప వార్త. మా రెండు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి ఫ్రేమ్ వర్క్ పై అంగీకరించామని మోడీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం, రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా గత ఆగస్టులో భారత్‌పై విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని ట్రంప్ తొలగించారు. న్యూఢిల్లీ నేరుగా లేదా పరోక్షంగా మాస్కో నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి కట్టుబడిందని అమెరికా తెలిపింది. ఈ మధ్యంతర ఒప్పందంతో భారత ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ తెరుచుకుంటుందని, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. భారత వస్తువులపై అమెరికా సుంకాలు గతంలో ఉన్న 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. సంయుక్త ప్రకటన ప్రకారం, ఈ ఫ్రేమ్ వర్క్ ను త్వరితగతిన అమలు చేసి, పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)కు దారి తీసేలా చర్యలు చేపట్టనున్నారు. అమెరికా పారిశ్రామిక వస్తువులపై, అలాగే పలు వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుందని ప్రకటనలో పేర్కొన్నారు.
