
ట్రేడ్‌డీల్‌తో కాటన్ సంబంధిత రంగాలపై ప్రభావం: రాహుల్‌గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇండియా–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. టారిఫ్ నిబంధనల విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని , ముఖ్యంగా పత్తి రైతులు, టెక్స్టైల్ ఎగుమతిదారులకు ఇది తీరని నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. అమెరికాలో భారతీయ గార్మెంట్లపై 18 శాతం టారిఫ్ విధిస్తుండగా, బంగ్లాదేశ్‌కు 0 శాతం టారిఫ్ ప్రయోజనం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ రాయితీకి బదులుగా బంగ్లాదేశ్ అమెరికన్ పత్తిని దిగుమతి చేసుకోవాలనే షరతు ఉందని తెలిపారు. ఈ విషయాన్ని దేశానికి ముందుగానే ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు.
బంగ్లాదేశ్ కూడా మన పత్తి దిగుమతులను తగ్గించుకుంటోంది
అమెరికన్ పత్తిని దిగుమతి చేసుకుంటే దేశీయ పత్తి రైతులు నష్టపోతారు. దిగుమతి చేయకపోతే టెక్స్టైల్ పరిశ్రమ పోటీలో వెనుకంజలో నిలిచిపోతుంది. ఇది ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ పరిస్థితి కాదా? అని ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ భారత్ నుంచి పత్తి దిగుమతులను తగ్గించుకుంటామనే సంకేతాలు ఇస్తోందని, ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరంగా చేస్తుందని పేర్కొన్నారు.
దేశంలో లక్షలాది కుటుంబాల జీవనాధారం పత్తి సాగు, టెక్స్టైల్ పరిశ్రమలపైనే ఆధారపడి ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ రంగాలపై దెబ్బ పడితే నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పెరుగుతుందని హెచ్చరించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒప్పందం కుదుర్చుకోవాల్సిన ప్రభుత్వం రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలను రక్షించడంలో విఫలమైందని ఆరోపించారు.
గత వారం ప్రకటించిన ఇండియా–అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం పరస్పర ప్రయోజనాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఫ్రేమ్‌వర్క్‌గా ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ టారిఫ్ తగ్గింపులు లేదా రద్దు చేయనుంది. ప్రతిగా అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై 18 శాతం పరస్పర టారిఫ్ విధించనుంది. పూర్తి అమలుతో జనరిక్ ఔషధాలు, వజ్రాలు, విమాన భాగాలపై అమెరికా టారిఫ్‌లు తొలగించనుంద. ఈ ఒప్పందం దేశీయ వ్యవసాయం, టెక్స్టైల్ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
