Let's talk: editor@tmv.in
ట్రాన్స్ జెండర్ల ఆత్మహత్యాయత్నం

ట్రాన్స్ జెండర్ల ఆత్మహత్యాయత్నం

Panthagani Anusha
17 అక్టోబర్, 2025

మధ్యప్రదేశ్‌లోని ఇందూర్ నగరం మరోసారి సంచలనానికి కారణమైంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు బుధవారం రాత్రి ప్రాణహానికీ దారితీసే స్థాయికి చేరింది. డబ్బు లావాదేవీలు, నాయకత్వ హక్కులపై నెలకొన్న విభేదాలతో విసిగిపోయిన 24 మంది ట్రాన్స్‌జెండర్‌లు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని వెంటనే మహారాజా యశవంతరావు ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు.

ఈ ఘటన నంద్‌లాల్‌పురా ప్రాంతంలో చోటుచేసుకుంది. ట్రాన్స్‌జెండర్ నాయకురాలు సప్నా హాజీ (సప్నా గురు) ఆధ్వర్యంలోని ఒక వర్గం, మరో వర్గ సభ్యులతో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. కాగా ప్రత్యర్థి వర్గం ఆరోపణల ప్రకారం, సప్నా హాజీ ఆమె ముగ్గురు అనుచరులు ఇటీవల ట్రాన్స్‌జెండర్ సమావేశం నిర్వహించేందుకు సేకరించిన డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా దుర్వినియోగం చేశారు. అంతేకాక, ఆ మొత్తాన్ని అడిగిన వారిపై దాడులు, ప్రాణహానీ హెచ్చరికలు జారీ చేశారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో పాంఢరినాథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, ప్రధాన నిందితురాలిగా సప్నా హాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనంగా, ఆమె అనుచరులు ఇతర సంబంధిత వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది.అయితే పోలీసులు ఈ కేసులో ఆర్థిక మోసం, బెదిరింపులు, వేధింపులు వంటి విభాగాల కింద కేసు నమోదు చేశారు.కాగా ప్రస్తుతం కస్టడీలో ట్రాన్స్ జెండర్ నాయకురాలిని విచారిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ రాజేష్ దండోటియా తెలిపారు.

మరోవైపు బాధిత వర్గం ఆరోపణల ప్రకారం, సప్నా హాజీ ఆమె అనుచరులు కమ్యూనిటీ సమావేశం కోసం సేకరించిన డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని, అంతేకాకుండా వారిని బెదిరించారని తెలిపారు. ఈ వేధింపులతో విసిగిపోయి తమ వర్గానికి చెందిన 24 మంది ఫినాయిల్ తాగినట్లు వారు పేర్కొన్నారు.

ఘటన స్థలంలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో , నేహా కున్వర్గాఅనే ట్రాన్స్‌జెండర్ తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా, అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించి ఆమెను ఆపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “గత 16 ఏళ్లుగా సప్నా హాజీ, రాజా హష్మీ మమ్మల్ని భిక్షాటన చేయమని బలవంతం చేస్తున్నారు. మేము ఎదుర్కొంటున్న ఈ వేధింపులు ఇక భరించలేము. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే, మా శిబిరంలో ఉన్న 300 మంది ట్రాన్స్‌జెండర్‌లు సమూహంగా ఆత్మహత్య చేసుకుంటారు అని హెచ్చరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ప్రతినిధుల బృందం నగర పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్‌ను కలిసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో ఇందూర్ ఎంపీ శంకర్ లాల్వాని మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ వర్గాల మధ్య జరుగుతున్న ఈ అంతర్గత ఘర్షణ నగర ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తోంది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.

దీర్ఘకాలిక వివాదం

ఇందూర్ నగరంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీల మధ్య ఆధిపత్యం, ఆర్థిక లావాదేవీలు, మరియు నాయకత్వ హక్కులపై వివాదం గత కొంతకాలంగా కొనసాగుతుంది. తాజాగా చోటుచేసుకున్న ఈ సంఘటన, కమ్యూనిటీలో పెరుగుతున్న విభేదాలు ఎంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయో చూపిస్తోంది. పోలీసులు ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు

ట్రాన్స్ జెండర్ల ఆత్మహత్యాయత్నం - Tholi Paluku