
ట్రాన్స్‌జెండర్ హక్కుల సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై శారీరక హాని జరిగితే దశలవారీ శిక్షలను విధించే విధంగా రూపొందించిన ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ బిల్–2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మార్చి 30న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రకటించే తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇటీవలే పార్లమెంట్ రెండు సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ సవరణ బిల్లు ప్రకారం ‘ట్రాన్స్‌జెండర్’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. అలాగే వేర్వేరు లైంగిక ప్రవృత్తులు లేదా స్వీయ లింగ గుర్తింపులు (గే, లెస్బియన్ వంటి వర్గాలు) ఈ చట్ట పరిధిలోకి రావని పేర్కొంది. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇక ఒక వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు పొందాలా వద్దా అన్నది నిర్ణయించేందుకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసే నిబంధనను కూడా బిల్లులో చేర్చారు. ఇది వ్యక్తిగత స్వీయ గుర్తింపు హక్కును తగ్గిస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి.
పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ప్రభుత్వం మాత్రం ఈ చట్టం లక్ష్యం ట్రాన్స్‌జెండర్ సమాజానికి చట్టపరమైన రక్షణ కల్పించడం మాత్రమేనని స్పష్టం చేసింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్రకుమార్ మాట్లాడుతూ హర్మోన్, జన్యు కారణాల వల్ల వివక్షను ఎదుర్కొనే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రక్షణ ఇవ్వడమే ఈ సవరణ ఉద్దేశమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 30కిపైగా రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా వారి హక్కులకు స్పష్టత వస్తుందని, సమాజంలో ప్రధాన ప్రవాహంలోకి వారిని తీసుకురావడం లక్ష్యమని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. గే, లెస్బియన్ వ్యక్తులను చట్ట పరిధి నుంచి తప్పించడం సరైంది కాదని, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల స్వీయ గుర్తింపు హక్కును కూడా ఇది పరిమితం చేస్తుందని విమర్శించాయి. అలాగే ట్రాన్స్‌జెండర్స్ కూడా సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. చర్చల అనంతరం రాజ్యసభలో బిల్లు వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది.
