
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై నార్త్ జోన్ డీసీపీ సమీక్ష
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం, నగరంలో ప్రజా శాంతి పరిరక్షణే లక్ష్యంగా నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో నార్త్ జోన్ పరిధిలోని సుమారు 25 మంది ట్రాన్స్‌జెండర్లు పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. సమాజంలో తమకు ఎదురవుతున్న వివక్ష, సామాజిక ఆమోదం లేకపోవడం, ఉపాధి అవకాశాల కొరత, గుర్తింపు కార్డుల లేమి, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్లు ఆలస్యంగా రావడం వంటి సమస్యలను వారు డీసీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పునరావాస సహాయాలు అందకుండా పోతున్నాయని వారు వాపోయారు.
అదే సమయంలో కొన్ని సామాజిక కార్యక్రమాలు, వేడుకల సమయంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్న ప్రజా ఫిర్యాదులు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా బెదిరింపులు, డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై డీసీపీ స్పష్టంగా స్పందించారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ సముదాయానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, గౌరవప్రదమైన జీవనోపాధి మార్గాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వారి నిజమైన సమస్యలను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ల జారీ, సంక్షేమ పథకాల అమలులో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు సహకరిస్తామని తెలిపారు.
అయితే, ప్రజలను బెదిరించడం లేదా అక్రమంగా డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలను సహించబోమని డీసీపీ స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశం చివరలో, ట్రాన్స్‌జెండర్ సముదాయంతో నిరంతర సంభాషణ కొనసాగిస్తామని, చట్టబద్ధమైన ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తామని, ప్రజా శాంతి భద్రతలను కాపాడుతూ ప్రతి ఒక్కరి గౌరవం, హక్కుల రక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉంటుందని డీసీపీ భరోసా ఇచ్చారు.
