Let's talk: editor@tmv.in
ట్రంప్ 'శాంతి మండలి'లో చేరేందుకు నో చెప్పిన చైనా

ట్రంప్ 'శాంతి మండలి'లో చేరేందుకు నో చెప్పిన చైనా

Shaik Mohammad Shaffee
23 జనవరి, 2026

ప్రపంచ శాంతిని నెలకొల్పే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 'బోర్డ్ ఆఫ్ పీస్' (శాంతి మండలి)లో చేరడానికి చైనా నిరాకరించింది. అంతర్జాతీయ వేదికలపై అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, తాము ఐక్యరాజ్యసమితి కేంద్రంగా సాగే అంతర్జాతీయ వ్యవస్థకే కట్టుబడి ఉంటామని బీజింగ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

యూఎన్ చార్టర్‌కే మా ప్రాధాన్యం

అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారినా ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు, అంతర్జాతీయ చట్టాలకు లోబడే పనిచేస్తామని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ప్రతిపాదించిన ఈ కొత్త మండలి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తగ్గించేలా ఉందన్నదే బీజింగ్ ప్రధాన అభ్యంతరం. ముఖ్యంగా తన మిత్రదేశమైన ఇరాన్‌ను అణుముప్పుగా అభివర్ణిస్తూ, దానిని దోషిగా నిలబెట్టే ఏ వేదికలోనూ తాము భాగస్వాములం కాలేమని చైనా పరోక్షంగా సంకేతాలిచ్చింది. అమెరికా నేతృత్వంలోని కూటమిలో చేరడం కంటే, ఐక్యరాజ్యసమితిని పరిరక్షించే శక్తిగా ప్రపంచ దేశాల ముందు నిలబడటానికే చైనా మొగ్గు చూపుతోంది.

చైనా తిరస్కరణకు ప్రధాన కారణాలివే..

ఈ ఆహ్వానాన్ని చైనా తిరస్కరించడం వెనుక బలమైన రాజకీయ, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. సభ్యుల ఎంపిక నుంచి ఎజెండా నిర్ణయం వరకు సర్వాధికారాలు వైట్ హౌస్ చేతుల్లోనే ఉండటం వల్ల, దీనిని అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకునే వేదికగా చైనా భావిస్తోంది. అలాగే ఒక బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చిన దేశాలకే 'శాశ్వత సభ్యత్వం' కల్పించాలనే నిబంధన అంతర్జాతీయ సమానత్వ సూత్రాలకు విరుద్ధమని, ఇది ధనిక దేశాల గుత్తాధిపత్యానికి దారితీస్తుందని బీజింగ్ బలంగా వాదిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా 'గ్లోబల్ సౌత్' దేశాలకు నాయకత్వం వహిస్తూ, అమెరికా సృష్టించే ప్రత్యేక బోర్డుల కంటే ఐక్యరాజ్యసమితి వ్యవస్థకే ప్రాధాన్యతనివ్వాలని చైనా ఆశిస్తోంది.

ఐరాసపై ట్రంప్ విమర్శలు

మరోవైపు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ట్రంప్ ఈ బోర్డుపై ధీమా వ్యక్తం చేశారు. "ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డు. ఐక్యరాజ్యసమితి చేయలేకపోయిన పనులను ఈ శాంతి మండలి చేసి చూపిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు ముప్పును తొలగించడం ద్వారానే మధ్యప్రాచ్యంలో శాంతి సాధ్యమైందని, చైనా రాకపోయినా ఇప్పటికే 25 దేశాలు ఈ బోర్డులో చేరడానికి అంగీకరించాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అమెరికా చర్యలు తీసుకోనుందా?

చైనా నిర్ణయంపై అమెరికా వెంటనే కఠిన చర్యలు తీసుకునే అవకాశం తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక స్వచ్ఛంద వేదిక మాత్రమే. అయితే రాజకీయంగా మాత్రం ట్రంప్ ప్రభుత్వం చైనాపై మాటల దాడి పెంచే అవకాశం ఉంది. "చైనా శాంతికి అడ్డుపడుతోంది" అనే ముద్ర వేయడం ద్వారా అంతర్జాతీయంగా బీజింగ్‌ను ఒంటరి చేయాలని అమెరికా భావించవచ్చు.