Let's talk: editor@tmv.in
ట్రంప్‌ వలలో పాకిస్థాన్‌

ట్రంప్‌ వలలో పాకిస్థాన్‌

FL - TRND
9 అక్టోబర్, 2025

నిన్నమొన్నటివరకు ఇజ్రాయెల్‌ పేరు వినగానే పాకిస్థాన్‌ ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగిసి పడేది. పాలస్తీనా కోసం గళం వినిపించిన ముస్లిం ప్రపంచంలో ముందు వరుసలో నిలిచిన దేశం పాకిస్థాన్‌. అదే పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ఇస్తోంది. గాజాలో వేలాది మంది ముస్లింలు చనిపోతున్న వేళ పాకిస్తాన్ మౌనం పాటించే స్థాయికి దిగజారింది. ట్రంప్‌తో చేతులు కలిపింది. శాంతి పేరిట ఇజ్రాయెల్ పక్షాన నిలబడింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ ప్రజలకే కాదు, మొత్తం ముస్లిం ప్రపంచానికీ ద్రోహంగా కనిపిస్తోంది. గాజాలో రక్తం కారుతుంటే, పాకిస్తాన్ వైట్ హౌస్‌లో ట్రంప్‌తో చిరునవ్వులు చిందించింది. ఇది ఇస్లామిక్ ప్రపంచానికి తీవ్రమైన షాక్‌గానే చెప్పాలి.

ఇక ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికలో 20పాయింట్లు ఉన్నాయి. కానీ అవి నిజంగా శాంతి పాయింట్లు కావని ముస్లిం వర్గాల ఆరోపణ. అవి ఇజ్రాయెల్ భద్రత కోసం వేసిన గీతలు మాత్రమే. గాజాలో అంతర్జాతీయ దళాలు మోహరించాలనే ఆలోచన ఉంది. ఆ దళాల్లో పాకిస్తాన్ సైన్యం కూడా పాల్గొనాలా అనే సందేహం అక్కడి ప్రజల మనసులో తుఫాను రేపుతోంది. ఇజ్రాయెల్‌తో కలసి పనిచేయాలా అనే ఆలోచన పాకిస్తాన్ ప్రజలకు అసహ్యం కలిగిస్తోంది. మాజీ రాయబారులు, రక్షణ నిపుణులు, రాజకీయ నేతలు అందరూ ఒకే ప్రశ్న వేస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు ఇంత బలహీనంగా ఎందుకు మాట్లాడుతోంది? ఇజ్రాయెల్ ఆక్రమణను నిరసించిన దేశం, ఇప్పుడు దానికి పరోక్ష మద్దతు ఇస్తుందా? ఇటు పాకిస్తాన్‌లో వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి. మీడియా, మత సంస్థలు, విద్యార్థులు అందరూ ఒకే మాట చెబుతున్నారు. గాజా బాధితుల పక్షాన నిలబడకపోవడం పాకిస్తాన్ ఆత్మను అమ్ముకున్నట్లే అని నినదిస్తున్నారు.

జమాతే ఇస్లామీ, జమాతే ఉలేమా-ఈ-ఇస్లాం లాంటి మతపరమైన పార్టీలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తున్నాయి. గాజాలో ట్రంప్ ప్రణాళిక అమలైతే, అది ఇజ్రాయెల్ పాలనకు మళ్లీ మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నాయి. పాకిస్తాన్ ఇజ్రాయెల్‌ను గుర్తించే దిశగా ఒక్క అడుగు వేస్తే, దాన్ని ప్రతి దశలోనూ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అమెరికా దిశగా నడుస్తూనే ఉంది. ట్రంప్‌ను సంతోషపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా, పాకిస్తాన్ మాత్రం ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న మాటలను అంతర్జాతీయ వేదికలపై చెబుతోంది. ఇది దేశ ప్రజలకు అవమానంగా మారింది. రక్షణ నిపుణురాలు అయేషా సిద్ధికా చెప్పినట్లు పాకిస్తాన్‌లో పాలస్తీనా పట్ల ఉన్న అనుబంధం చాలా లోతుగా ఉంది. ఏ ప్రభుత్వం ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపినా అది ప్రజల ఆగ్రహానికి గురవుతుందనే వాస్తవాన్ని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరిచిపోయింది.

పాకిస్తాన్ ఒకప్పుడు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలకు నాయకత్వం వహించింది. కానీ ఇప్పుడు అదే దేశం అమెరికా దిశగా తిరిగింది. ఇది ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ స్థాయిని కూలగొట్టే మార్పు. ఇరాన్, టర్కీ, ఖతర్ లాంటి దేశాలు పాకిస్తాన్ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ ఒకప్పుడు ఇజ్రాయెల్‌ అంతుచూస్తానని గర్వంగా చెప్పింది. ఇప్పుడు ఆ దేశం ఇజ్రాయెల్‌ను రక్షించే ఒప్పందాలకు మద్దతు ఇస్తోంది. ఇది చరిత్రలో ఒక విరుద్ధం. ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించింది. కానీ ఈసారి గాజాలో రక్తం కారుతున్నప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉంది. ఇది దాని రాజకీయ చరిత్రలోనే కాదు, దాని నైతిక పునాది మీద కూడా మచ్చ వేసిన నిర్ణయం.

ప్రపంచం ఇప్పుడు ప్రశ్నిస్తోంది. పాకిస్తాన్ ముస్లిం దేశమా, లేదా అమెరికా విధానాల బానిస దేశమా? గాజాలో పిల్లలు చనిపోతున్నప్పుడు పాకిస్తాన్ ఎందుకు మౌనంగా ఉంది? ఇది ఒక రాజకీయ పొరపాటు కాదు. ఇది పాకిస్తాన్ చరిత్రలో ఒక నైతిక పతనం. ఒకప్పుడు ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూసిన దేశం ఇప్పుడు దానికి భద్రతా కవచం కావాలనుకుంటోంది. గాజా విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్‌ను ప్రపంచ ముస్లింల మనసులో నుంచి వేరుచేసింది. మరి చూడాలి పాకిస్థాన్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో అన్నది వెయిట్ అండ్ సీ.

ట్రంప్‌ వలలో పాకిస్థాన్‌ - Tholi Paluku