Let's talk: editor@tmv.in
ట్రంప్, మోడీ స్నేహంతో బలపడుతున్న భారత్-అమెరికా బంధం: సెర్గియో గోర్

ట్రంప్, మోడీ స్నేహంతో బలపడుతున్న భారత్-అమెరికా బంధం: సెర్గియో గోర్

Shaik Mohammad Shaffee
2 ఏప్రిల్, 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఉన్న స్నేహ బంధం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్యానించారు. బుధవారం 'స్పాన్' మేగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీని అధ్యక్షుడు ట్రంప్ ఒక 'నిజమైన మిత్రుడు'గా భావిస్తున్నారని, ఈ సాన్నిహిత్యం ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల బంధాన్ని 21వ శతాబ్దపు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

అనేక రంగాల్లో అద్భుత అవకాశాలు

భారత్-అమెరికా దేశాల మధ్య కేవలం రాజకీయ సంబంధాలే కాకుండా రక్షణ, ఇంధనం, విమానయానం, ఆధునిక తయారీ రంగం, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో అనేక అవకాశాలు ఉన్నాయని సెర్గియో గోర్ వివరించారు. ఈ భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు కలగాలని, ముఖ్యంగా సరఫరా గొలుసులను మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యక్షుడు ట్రంప్ ఫలితాల కోసం వేగంగా పనిచేసే నాయకుడని పేర్కొన్న గోర్.. తన పని కూడా అమెరికా ప్రజలకు సానుకూల ఫలితాలను అందించడంతో పాటు భారత్‌తో సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడమేనని వెల్లడించారు.

భారతీయుల ఆత్మీయత మరువలేనిది

భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ.. సుమారు 15 ఏళ్ల క్రితం తన కుటుంబంతో కలిసి భారత్‌లో పర్యటించినప్పటి నుంచి ఈ దేశం తన హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని గోర్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. "ఇక్కడి సంస్కృతి, చరిత్ర.. నా హృదయంపై చెరగని ముద్ర వేశాయి. అన్నింటికంటే భారతీయుల ఆత్మీయత, మంచితనం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చినా ఇక్కడి ప్రజల స్నేహపూర్వక స్వభావం ఏమాత్రం తగ్గలేదు" అని ఆయన కొనియాడారు. అంతకుముందు మంగళవారం వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన గోర్.. భారత సంబంధాలపై ట్రంప్ ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.