
ట్రంప్ నరేందర్ అంటే.. మోడీ సరెండర్ అవుతారు: రాహుల్ గాంధీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో తన సంబంధాలు, టారిఫ్‌లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై బుధవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1971 యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమెరికా ఒత్తిడిని తట్టుకున్న తీరును ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రధాని మోడీ వైఖరిని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గురించి నాకు బాగా తెలుసు. కొద్దిగా వారిపై ఒత్తిడి తీసుకోస్తే వారు ఏ విధంగా పారిపోతారో రాహుల్ గాంధీ వ్యంగంగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. అటువైపు నుంచి ట్రంప్ ఫోన్ చేసి.. క్యా మోడీజీ, ఏం చేస్తున్నారు? నరేందర్.. అంటే ఇక్కడ సరెండర్ అంటారు. వీరు స్వతంత్ర్య ఉద్యమం సమయం నుంచి ఇంతే. కొద్దిగా బెదిరిస్తే లేఖలు రాస్తారు. కాంగ్రెస్ అలా కాదు. గాంధీజీ, నెహ్రు, పటేల్ వీరు లొంగిపోయేవారు కాదు. ఎంతటి శక్తి వంతులైనా వారితో పోరాడేవారు.
తేడా అర్థం చేసుకోండి
రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా ట్రంప్ భారత్‌పై విధించిన టారిఫ్‌లపై వ్యాఖ్యానిస్తూ మోడీ నాకు తెలిసి అంతగా సంతోషంగా లేరని అన్నారు. అలాగే ప్రధాని మోడీ నన్ను కలవడానికి వచ్చారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఫరక్ సమ్జో, సర్ జీ(తేడా అర్థం చేసుకోండి)! అంటూ పోస్టు చేశారు. భారత్–పాక్ సైనిక ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ ఫోన్ కాల్ తరువాత మోడీ లొంగిపోయారు అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన షేర్ చేశారు. అదే సమయంలో, 1971 యుద్ధంలో అమెరికా సెవెన్త్ ఫ్లీట్(అమెరికా నౌకాదళానికి చెందిన ప్రధాన యుద్ధ నౌకాదళం)ను పాకిస్థాన్ కు మద్దతుగా పంపినప్పటికీ ఇందిరా గాంధీ వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు.
తరువాత ఏంటి?
ఇదే అంశంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ కూడా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. నమస్తే ట్రంప్ నుంచి హౌడీ మోడీ, డొనాల్డ్ భాయ్ వరకు వచ్చాం. ఇక తర్వాత ఏంటి? అని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లు విధించినట్లు, అందులో రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి 25 శాతం ఉన్నట్లు తెలిపింది. అలాగే భారత్ ఐదేళ్లుగా అపాచీ హెలికాప్టర్ల కోసం ఎదురు చూస్తోందని, 68 అపాచీల ఆర్డర్‌ను మార్చుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇదివరకూ కూడా ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లను చాలా వేగంగా పెంచగలం అన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని విమర్శించింది. నమస్తే ట్రంప్, హౌడీ మోడీ’ కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రచారం దేశానికి పెద్దగా లాభం చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది.
