
ట్రంప్ దౌత్య నీతి: బెలారస్ జైళ్ల నుండి 250 మంది రాజకీయ ఖైదీల విడుదల
బెలారస్ కఠిన నియంత, అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో అమెరికా విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేసేలా ఇటీవలకుదిరిన ఒప్పందంలో భాగంగా, 250 మంది రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఒంటరిగామారిన తన దేశానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా లుకాశెంకో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దౌత్యవేత్త జాన్ కోల్, మిన్స్క్‌లో, లుకాశెంకోతో భేటీ అయిన తర్వాత ఈ క్షమాభిక్ష ప్రక్రియ జరిగింది.
ఈ ఖైదీల విడుదలను అమెరికా ప్రతినిధి జాన్ కోల్ ఒక "ముఖ్యమైన మానవీయ మైలురాయి"గా అభివర్ణించారు. ఇది అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ప్రత్యక్ష, కఠినమైన దౌత్య నీతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కూడా అమెరికా అధికారులు లుకాశెంకోతో భేటీ అయినప్పుడు కొన్ని ఆంక్షలను సడలించారు. ఆ సమయంలో 123 మంది ఖైదీలను విడుదల చేసి ఉక్రెయిన్, లిథువేనియా దేశాలకు పంపించారు.
సుదీర్ఘ పాలన, ఆంక్షలు:
రష్యాకు అత్యంత సన్నిహిత మిత్రుడైన లుకాశెంకో, గత మూడు దశాబ్దాలకు పైగా 95 లక్షల జనాభా ఉన్న బెలారస్‌ను ఉక్కుపాదంతో పాలిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు, 2022లో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడికి తన భూభాగాన్ని వాడుకోవడానికి అనుమతించినందుకు పాశ్చాత్య దేశాలు బెలారస్‌పై పలుమార్లు ఆంక్షలు విధించాయి. దీనివల్ల ఆ దేశం అంతర్జాతీయంగా ఒంటరైంది.
2020 నాటి నిరసనల నేపథ్యం:
2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత బెలారస్‌లో జరిగిన అతిపెద్ద నిరసనలు ఇవే. ఆ సమయంలో ప్రభుత్వం నిరసనకారులపై విరుచుకుపడి వేలాది మందిని నిర్బంధించింది. ప్రముఖ ప్రతిపక్ష నేతలు జైలు పాలవ్వగా, మరికొందరు ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయారు.
గతేడాది ఏడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన లుకాశెంకో, ఇటీవల పాశ్చాత్య దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బియాలియాట్స్కీతో పాటు ప్రముఖ అసమ్మతి నేతలు సియార్హీ త్సిఖానౌస్కీ, విక్టర్ బాబారికా, మరియా కోలెస్నికోవాలను లుకాశెంకో విడుదల చేశారు. 2025 ఆగస్టులో ట్రంప్ స్వయంగా లుకాశెంకోతో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యక్ష భేటీకి కూడా సుముఖత వ్యక్తం చేశారు.
అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతున్నప్పటికీ, బెలారస్‌లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ప్రముఖ హక్కుల సంస్థ 'వియాస్నా' గణాంకాల ప్రకారం, బెలారస్‌లో ఇప్పటికీ 1,100 మందికి పైగా రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు. తాజా విడుదల ఆ సంఖ్యను తగ్గించినప్పటికీ, పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
