
ట్రంప్ టారిఫ్‌లు చెల్లవు.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన 'సుంకాల' నిర్ణయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ట్రంప్ అమలు చేసిన భారీ దిగుమతి సుంకాలు రాజ్యాంగబద్ధం కావని కోర్టు స్పష్టం చేసింది. 6-3 మెజారిటీతో వెలువడిన ఈ తీర్పు, ట్రంప్ పరిపాలనలో ఎదురైన అతిపెద్ద న్యాయపరమైన ఓటమిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమెరికా వాణిజ్య విధానంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
రాజ్యాంగ అధికారాలే కీలకం
అమెరికా రాజ్యాంగం ప్రకారం, పన్నులు, సుంకాలను విధించే అధికారం కేవలం కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు)కు మాత్రమే ఉందని ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. 'పన్నులు విధించే అధికారం కార్యనిర్వాహక శాఖకు (అధ్యక్షుడికి) లేదు' అని ఆయన పేర్కొన్నారు. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి అపరిమితమైన సుంకాలు విధించే అధికారం లేదని కోర్టు తేల్చిచెప్పింది. ట్రంప్ ఈ చట్టాన్ని ఉపయోగించి దాదాపు అన్ని దేశాలపై 'పరస్పర సుంకాలు' విధించడం చట్టవిరుద్ధమని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఐఈఈపీఏ చట్టం: వివాదం ఏమిటి?
ట్రంప్ 2025 ఏప్రిల్‌లో వాణిజ్య లోటును సాకుగా చూపి, జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఈ 'పరస్పర సుంకాలను' అమలు చేశారు. అంతకుముందు కెనడా, చైనా, మెక్సికోలపై డ్రగ్ ట్రాఫికింగ్‌ను కారణం చూపి సుంకాలు విధించారు. ఈ చట్టాన్ని ( ఐఈఈపీఏ ) గతంలో అధ్యక్షులు కేవలం ఆస్తులను ఫ్రీజ్ చేయడానికి లేదా ఆంక్షలు విధించడానికి మాత్రమే వాడేవారు. కానీ ట్రంప్ ఈ చట్టాన్ని ఉపయోగించి దాదాపు అన్ని దేశాలపై సుంకాలు విధించడంపై చిన్న వ్యాపార సంస్థలు, పలు రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం, కోర్టు ఇప్పుడు ఈ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
ఆర్థిక ఇబ్బందులు
ట్రంప్ సుంకాల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలపై భారీ భారం పడింది. అంచనాల ప్రకారం, ఈ వాణిజ్య యుద్ధం వల్ల ఒక్కో అమెరికన్ కుటుంబంపై సుమారు 1,100 డాలర్ల అదనపు భారం పడింది. డిసెంబర్ 14 నాటికి ప్రభుత్వం ఈ సుంకాల ద్వారా సుమారు 134 బిలియన్ డాలర్లను సేకరించింది. అయితే ఇప్పటికే వసూలు చేసిన ఈ సొమ్మును తిరిగి ఎలా చెల్లిస్తారనే అంశంపై కోర్టు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీనివల్ల భారీ రిఫండ్ ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశం ఉందని న్యాయమూర్తి బ్రెట్ కావనాగ్ హెచ్చరించారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రభావం
ఈ తీర్పు భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల భారత్, అమెరికా దేశాలు పరస్పర ప్రయోజనకరమైన మధ్యంతర ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్ తన ఎగుమతులపై సుంకాలు తగ్గించుకోవాలని, అమెరికా కూడా కొన్ని రంగాల్లో సుంకాలను తొలగించాలని అంగీకారానికి వచ్చాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అమెరికా అమలు చేయాల్సిన ఈ వాణిజ్య విధానాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.
తీర్పు వెనుక భిన్న వాదనలు
తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టులోని ముగ్గురు కన్సర్వేటివ్ న్యాయమూర్తులు (అలిటో, థామస్, కావనాగ్) భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుంకాల విధానం సమంజసమో కాదో పక్కన పెడితే, చట్టం, చరిత్ర ప్రకారం అవి చట్టబద్ధమేనని న్యాయమూర్తి కావనాగ్ వాదించారు. మరోవైపు ట్రంప్ ఈ తీర్పును తీవ్రంగా విమర్శించారు. ఒకవేళ తన నిర్ణయాన్ని కోర్టు తిరస్కరిస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ విధానాలకు ఇది తొలి పెద్ద ఎదురుదెబ్బ
గత ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు వరుసగా విజయాలు దక్కాయి. మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల సేవలకు ఆంక్షలు, ప్రభుత్వ శాఖల్లో కోతలు వంటి అంశాల్లో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. కానీ, సుంకాల విషయంలో మాత్రం కోర్టు కఠినంగా వ్యవహరించింది. ఈ నిర్ణయం ఆయన తీసుకున్న ఇతర ఆర్థిక చర్యల చట్టబద్ధతను కూడా ప్రశ్నించేలా చేస్తోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సుంకాలకు సంబంధించి ఇతర చట్టాల ద్వారా ట్రంప్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, వాటికి పరిమితులు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
అనిశ్చితిలో వాణిజ్య మార్కెట్లు
ఈ పరిణామం అమెరికా వ్యాపార వర్గాల్లో ఆందోళన నింపింది. ఇప్పటికే కాస్ట్కో వంటి పెద్ద రిటైల్ చైన్లు సుంకాల రిఫండ్ల కోసం కోర్టులను ఆశ్రయించాయి. వచ్చే దశాబ్ద కాలంలో ఈ సుంకాల వల్ల సుమారు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రభావం ఉంటుందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ప్రస్తుత తీర్పు నేపథ్యంలో గ్లోబల్ ట్రేడ్, ద్రవ్యోల్బణం, అమెరికా గృహ ఆర్థిక స్థితిగతులు ఏ దిశగా పయనిస్తాయనేది వేచి చూడాలి.
