Let's talk: editor@tmv.in
ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి ఆమోదం

ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి ఆమోదం

Shaik Mohammad Shaffee
19 నవంబర్, 2025

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య గత రెండేళ్లుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం ఆమోదం తెలిపింది. ఈ తీర్మానంలో తక్షణ యుద్ధ విరమణ, గాజాలో అంతర్జాతీయ బలగాల నియోగం, పునర్నిర్మాణం, తాత్కాలిక పాలనా ఏర్పాట్ల కోసం సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.

ట్రంప్ ప్రతిపాదించిన ఈ సమగ్ర ప్రణాళికలో ఇజ్రాయెల్‌-హమాస్‌ సంఘర్షణను శాశ్వతంగా పరిష్కరించేందుకు 20 కీలక సూత్రాలు ఉన్నాయి. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్‌, పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్ గత నెల అక్టోబర్ 10న సంతకాలు చేశాయి. ఈ సంతకాల తర్వాతే ప్రణాళిక మొదటి దశగా యుద్ధ విరమణ, బందీల విడుదల ఒప్పందం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గాజా భవిష్యత్తు పాలన, ఆయుధాలు అప్పగించడం వంటి అంశాలపై భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, సోమాలియా సహా మొత్తం 13 దేశాలు ఈ శాంతి ప్రణాళికకు మద్దతుగా ఓటు వేశాయి. ప్రపంచ అగ్రరాజ్యాలైన, వీటో అధికారం ఉన్న రష్యా, చైనా దేశాలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉండడం గమనార్హం.

ఈ తీర్మానం ప్రధాన లక్ష్యం గాజాను సైనిక రహిత, తీవ్రవాద రహిత ప్రాంతంగా మార్చి, ప్రజల ప్రయోజనం కోసం దాన్ని పునర్నిర్మించడం. గాజాలో శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి, యుద్ధ విరమణను పటిష్టం చేయడానికి అంతర్జాతీయ బలగాలను నియోగించడానికి ఈ తీర్మానం అనుమతిస్తుంది. అలాగే గాజా పునర్నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, అంతర్జాతీయ నిధుల సమీకరణకు, పరిపాలన మార్గదర్శకాలను సెట్ చేయడానికి తాత్కాలిక పరిపాలనా సంస్థగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ను ఏర్పాటు చేస్తారు.

ట్రంప్ హర్షం

తీర్మానం ఆమోదం నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో దీనిని “చరిత్రలో ఓ గొప్ప ఆమోదం”గా పేర్కొన్నారు. “ఇది ప్రపంచవ్యాప్తంగా మరింత శాంతిని తీసుకొస్తుంది” అని కూడా రాశారు. తాను శాంతి మండలికి అధ్యక్షత వహిస్తానని, ఇందులో " ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, గౌరవనీయమైన నాయకులు" ఉంటారని తెలిపారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌కు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడానికి ఒక రోజు ముందు ఈ ఓటింగ్ జరగడం విశేషం.

అమెరికా ప్రతినిధులు ఈ తీర్మానాన్ని "చారిత్రక మైలురాయి"గా అభివర్ణించారు. భద్రతా మండలి ఆమోదంతో గాజాలో స్థిరత్వం ఏర్పడి, ఇజ్రాయెల్ భద్రతతో జీవించే వాతావరణం నెలకొంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

హమాస్ తీవ్ర ఖండన

భద్రతా మండలి ఆమోదాన్ని పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్ తీవ్రంగా ఖండించింది. ఈ తీర్మానం గాజా ప్రజల స్వాతంత్య్రం, స్వయంపాలన హక్కులకు భంగం కలిగిస్తుందని ఆ సంస్థ మండిపడింది. "ఈ తీర్మానం పాలస్తీనా ప్రజల స్వాతంత్య్రం, స్వయంపాలన హక్కులను గౌరవించడంలేదు. ఇక్కడి ప్రజల రాజకీయ ఆకాంక్షలను పక్కన పెట్టి తాత్కాలిక పాలనా సంస్థ పేరుతో ఇతర దేశాల నిర్ణయాలను రుద్దే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది" అని పెర్కొంది. గాజా భవిష్యత్తును గాజా ప్రజలే నిర్ణయించాలని, విదేశీ బలగాలు లేదా పాలనా సంస్థలు తమ అభిప్రాయాలను రుద్దకూడదని హమాస్ స్పష్టం చేసింది.

రష్యా అభ్యంతరం

రష్యా శాశ్వత ప్రతినిధి వాస్సిలీ నెబెంజియా ఈ తీర్మానంపై ఓటు వేయకుండా దూరంగా ఉంటూ, దానిపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శాంతి మండలి, స్థిరీకరణ దళం "పని చేసే పద్ధతులు ఇంకా తెలియరాని" నేపథ్యంలో, ఇది గాజాను "వారి దయాదాక్షిణ్యాలకు" వదిలివేస్తుందని ఆయన విమర్శించారు. ఈ ప్రణాళిక "రెండు రాజ్యాల పరిష్కారానికి మరణశిక్షగా మారకూడదు" అని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ ప్రణాళికలోని కీలక అంశాలు

ట్రంప్ ప్రణాళిక ప్రకారం, రెండు పక్షాలు ఒప్పుకుంటే యుద్ధం వెంటనే ముగుస్తుంది. ఇజ్రాయెల్ బలగాలు బందీల విడుదలకు సిద్ధం కావడానికి అంగీకరించిన రేఖ వరకు వెనక్కి వెళ్తాయి. ఈ సమయంలో అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయి. పూర్తిస్థాయి దశలవారీ వైదొలగింపుకు అవసరమైన షరతులు నెరవేరే వరకు యుద్ధ రేఖలు యథాతథంగా ఉంటాయి.

ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని అంగీకరించిన 72 గంటల్లోపే బందీలందరూ (బతికిన వారు, మరణించిన వారు) తిరిగి పంపబడతారని ప్రణాళికలో పేర్కొన్నారు. గాజా పునర్నిర్మాణానికి “ట్రంప్ ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక” కూడా ప్రతిపాదించారు. మధ్యప్రాచ్యంలో ఆధునిక నగరాలను నిర్మించిన నిపుణులను ఇందులో భాగం చేస్తారు. ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసి ప్రయోజనకర సుంకాలు అందిస్తామని పేర్కొన్నారు. “ ఎవరూ గాజాను విడిచి వెళ్ళడానికి బలవంతం చేయబడరు. వెళ్లాలనుకునే వారికి వెళ్ళడానికి, తిరిగి రావడానికి స్వేచ్ఛ ఉంటుంది ” అని ప్రణాళికలో ఉంది. “మేము ప్రజలను గాజాలోనే ఉండమని ప్రోత్సహిస్తాం. మంచి గాజాను నిర్మించుకునే అవకాశం ఇస్తాం” అని ప్రణాళిక పేర్కొంటుంది.

ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక అమలు అవుతుందా?

ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక అమలు అవుతుందా అనేది ప్రాంతీయ రాజకీయాలు, హమాస్-ఇజ్రాయెల్ వైఖరి, అరబ్ దేశాల మద్దతుపై ఆధారపడింది. ప్లాన్ సాధ్యమే కానీ భద్రతా హామీలు లేకపోతే వర్కవుట్ కావడం కష్టం. అమెరికాకు గాజా అభివృద్ధి చేయాలని ఉండటంలో రెండు లాభాలు ఉన్నాయి. మొదట, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గితే అమెరికా వ్యూహాత్మక ప్రభావం పెరుగుతుంది. రెండవది, స్థిరమైన గాజా ఇజ్రాయెల్‌కు భద్రతను అందిస్తుంది. ఇది అమెరికా ప్రధాన మిత్రదేశం. అదనంగా శాంతి ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం ద్వారా అమెరికా గ్లోబల్ లీడర్‌షిప్‌కు పాజిటివ్ ఇమేజ్ లభిస్తుంది.

పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన అనూహ్య మెరుపు దాడితో ఈ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో హమాస్ సుమారు 1,200 మందిని హతమార్చి, 250 మందికి పైగా ప్రజలను బందీలుగా పట్టుకుంది. హమాస్ దాడికి ప్రతీకారంగా, ఇజ్రాయెల్ గాజాపై చేపట్టిన సైనిక దాడుల కారణంగా 67,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది ఇళ్లు పూర్తిగా నేలమట్టం కావడంతో లక్షలాది మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయి, నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం వేలాదిమంది ఆకలిదప్పులతో, సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.