Let's talk: editor@tmv.in
ట్రంప్‌ ఓ డిక్టేటర్‌, మోడీ అతని ‘గులాం’: మల్లికార్జున్ ఖర్గే

ట్రంప్‌ ఓ డిక్టేటర్‌, మోడీ అతని ‘గులాం’: మల్లికార్జున్ ఖర్గే

Pinjari Chand
9 మార్చి, 2026

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని, భారత ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు గులాం (బానిస)గా మారిపోయారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్య సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్‌ సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో చిట్టాపూర్‌లో రూ.1,069 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్‌ ఒత్తిడికి మోడీ తలవంచారని ఆరోపణ

భారతదేశం గతంలో రష్యా, ఇరాన్‌, వెనిజులా వంటి దేశాల నుంచి అవసరానికి అనుగుణంగా చమురు కొనుగోలు చేసేదని ఖర్గే తెలిపారు. అయితే ఇప్పుడు అమెరికా ఒత్తిడితో భారత్‌ తన ఇంధన కొనుగోళ్లను మార్చుకోవాల్సి వస్తోందని అన్నారు. అమెరికా సూచనల ప్రకారం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని చెప్పడంతో భారత్‌పై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరికలు వచ్చాయని ఆయన ఆరోపించారు. ట్రంప్‌ డిక్టేటర్‌. మోడీ అతని గులాం అని ఖర్గే అన్నారు.

రైతులపై ప్రభావం ఉంటుందని ఆందోళన

అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అమెరికాలో కేవలం 3 శాతం రైతులు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడుతుండగా, భారత్‌లో 65 శాతం మంది రైతులపై ఆధారపడుతున్నారని చెప్పారు. అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ టారిఫ్‌లు విధించలేని పరిస్థితి వచ్చిందని, అయితే భారత్‌ ఎగుమతి చేసే వస్తువులపై అమెరికా టారిఫ్‌లు విధిస్తోందని ఆరోపించారు.

విదేశాంగ విధానంపై విమర్శలు

భారత విదేశాంగ విధానం ప్రస్తుతం సరైన దిశలో లేదని ఖర్గే వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని నెహ్రు నాయకత్వంలో ఏర్పడిన అలీన ఉద్యమం ద్వారా భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చిందని గుర్తుచేశారు. అలాగే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్‌ వార్‌‌ సమయంలో భారత్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

ఎఫ్‌స్టీన్‌ ఫైళ్లపై ఆరోపణ

అమెరికాలోని ఎఫ్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన ఫైళ్లను ఉపయోగించి ట్రంప్‌ మోడీపై ఒత్తిడి తెస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఆ ఫైళ్లలో ప్రముఖుల వివరాలు ఉన్నాయని, వాటి కారణంగా ప్రధాని నోరు మూసుకుని ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి ఇచ్చిన అధికారాన్ని మోడీ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారని ఖర్గే విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్‌ కృషి చేసిందని, కానీ ప్రస్తుతం దేశం నష్టపోతుందని ఆయన ఆరోపించారు.

ట్రంప్‌ ఓ డిక్టేటర్‌, మోడీ అతని ‘గులాం’: మల్లికార్జున్ ఖర్గే - Tholi Paluku