Let's talk: editor@tmv.in
ట్రంప్‌కు మచాడో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేరు: నోబెల్ సంస్థ క్లారిటీ

ట్రంప్‌కు మచాడో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేరు: నోబెల్ సంస్థ క్లారిటీ

Shaik Mohammad Shaffee
12 జనవరి, 2026

వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరీనా మచాడో తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అందించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్ కీలక ప్రకటన విడుదల చేసింది. నోబెల్ శాంతి బహుమతి ఒకసారి ప్రకటించిన తర్వాత దాన్ని రద్దు చేయడం, ఇతరులకు బదిలీ చేయడం, పంచుకోవడం అసాధ్యమని స్పష్టం చేసింది. నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో “నోబెల్ శాంతి బహుమతి నిర్ణయం తుది నిర్ణయం. అది శాశ్వతంగా అమల్లో ఉంటుంది” అని తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో మచాడో వ్యాఖ్యలకు అధికారికంగా తెరదించింది.

మచాడో ప్రతిపాదన వెనుక కారణం

వెనిజులాలో సుదీర్ఘకాలం నియంతృత్వ పాలన సాగించిన నికోలస్‌ మదురోను బంధించడంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. మదురో ప్రస్తుతం న్యూయార్క్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ చారిత్రాత్మక విజయం వెనిజులాలో ప్రజాస్వామ్య మార్పుకు నాంది పలికిందని మచాడో భావించారు. అందుకే ఈ బహుమతి వెనిజులా ప్రజలదని, దీనిని ట్రంప్‌తో పంచుకోవడం లేదా ఆయనకు అంకితం ఇవ్వడం ద్వారా అమెరికా కృషిని గౌరవించాలని ఆమె ఆకాంక్షించారు.

ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మచాడో ఆకాంక్ష

ప్రముఖ టీవీ వ్యాఖ్యాత షాన్ హానిటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరియా కొరీనా మచాడో తన మనసులోని మాటను బయటపెట్టారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం ట్రంప్ చేసిన కృషి చాలా గొప్పదని, ఆయన చేసిన పని చరిత్రలో నిలిచిపోతుందని ఆమె కొనియాడారు. వెనిజులా ప్రజల తరఫున తనకు దక్కిన ఈ నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందించడం లేదా ఆయనతో పంచుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

వెనిజులా పాలనపై ట్రంప్ భిన్నమైన వైఖరి

మచాడో తన అవార్డును ట్రంప్‌కు ఇవ్వాలని కోరుకుంటున్నప్పటికీ, వెనిజులా రాజకీయ భవిష్యత్తుపై ట్రంప్ మాత్రం ఆమెకు మద్దతు ఇవ్వడం లేదు. మచాడోను "చాలా మంచి మహిళ" అని ప్రశంసించినప్పటికీ, ప్రస్తుతం వెనిజులాను పాలించే స్థాయి ప్రజా మద్దతు ఆమెకు లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా, మదురో హయాంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడాన్ని ట్రంప్ సమర్థిస్తున్నారు.

త్వరలో ట్రంప్-మచాడో భేటీ

వచ్చే వారం మరియా కొరీనా మచాడో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె స్వయంగా డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. ఈ భేటీలో నోబెల్ బహుమతి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మచాడో తనను కలిసి బహుమతిని ఆఫర్ చేయాలనుకోవడాన్ని ట్రంప్ "గొప్ప గౌరవం"గా అభివర్ణించారు. అయితే నోబెల్ కమిటీ నిబంధనల దృష్ట్యా, ఇది కేవలం మర్యాదపూర్వకమైన ప్రక్రియగానే మిగిలిపోనుంది.

ట్రంప్ ‘నోబెల్’ కల

డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి నోబెల్ శాంతి బహుమతిని గెలవాలనే కోరికను పలుమార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తర కొరియా, మధ్యప్రాచ్య శాంతి ఒప్పందాల విషయంలో తనకు ఈ గౌరవం దక్కాలని ఆయన భావించారు. ప్రస్తుతం మచాడో రూపంలో ఆ అవార్డు తన వద్దకు వస్తున్న తరుణంలో నోబెల్ ఇన్‌స్టిట్యూట్ అడ్డుచెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. నోబెల్ నిబంధనావళి ప్రకారం అవార్డు గ్రహీత ఆ గౌరవాన్ని వేరొకరికి బదిలీ చేసే అధికారం లేదని స్పష్టం చేయడం ద్వారా, ట్రంప్ నోబెల్ గెలిచిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కడం ప్రస్తుతానికి సాధ్యం కాదని తేలిపోయింది.

ట్రంప్‌కు మచాడో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేరు: నోబెల్ సంస్థ క్లారిటీ - Tholi Paluku