Let's talk: editor@tmv.in
ట్యునీషియాలో మళ్లీ రాజకీయ ఉద్రిక్తత

ట్యునీషియాలో మళ్లీ రాజకీయ ఉద్రిక్తత

Pinjari Chand
9 నవంబర్, 2025

ట్యునీషియా రాజధాని ట్యునీస్‌లో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ ముదురుతోంది. దేశ ప్రధాన విపక్ష కూటమి నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు జవ్‌హర్ బెన్ మబ్రేక్ గత వారం నుంచి చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా పలువురు ప్రముఖ విపక్ష నేతలు కూడా దీక్షలో పాల్గోన్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని అల్‌ జజీరా పేర్కొంది. మబ్రేక్ ను 2023 ఫిబ్రవరిలో రాష్ట్ర భద్రతకు వ్యతిరేకంగా కుట్ర, ఉగ్ర సంస్థలతో సంబంధం అన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. దీంతో ఆయన దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా బెన్ మబ్రేక్ తండ్రి, ప్రసిద్ధ కార్యకర్త ఎజ్జెద్దీన్ హజ్గుయి మాట్లాడుతూ నా కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడు. ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఆయనకు న్యాయం లభించే వరకు మేం కూడా నిరాహార దీక్ష చేస్తాం. అధ్యక్షుడు కైస్ సయీద్‌ను ఎప్పటికీ క్షమించం అని పేర్కొన్నారు.

ప్రధాన నేతల సంఘీభావం:

అల్ జుమ్హురి పార్టీ అధినేత ఇస్సాం చెబ్బీ, ఎన్నాహ్ధా పార్టీ అధ్యక్షుడు, 84 ఏళ్ల రషేద్ ఘన్నూషీ తదితరులు కూడా నిరాహార దీక్షలో పాల్గొననున్నట్లు ప్రకటించారు. న్యాయ స్వాతంత్ర్యం, దేశ స్వేచ్ఛ కోసం ఈ నిరాహారం చేస్తున్నామని ఘన్నూషీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. బెన్ మబ్రేక్‌పై రాష్ట్ర భద్రతకు వ్యతిరేకంగా కుట్ర, ఉగ్ర సంస్థతో సంబంధాలు అనే ఆరోపణలపై ఈ ఏడాది ఏప్రిల్‌లో 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే హ్యూమన్‌ రైట్స్‌ సంస్థలు దీనిని రాజకీయ కుతంత్రంగా అభివర్ణిస్తున్నాయి.

కైస్ సయీద్ పాలనలో

2019లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు కైస్ సయీద్ 2021లో పార్లమెంట్ ను రద్దు చేసి, ఆపై రాజ్యాంగాన్ని సవరించి అధికారం తన చేతుల్లోకి తీసుకున్నారు. 2022లో అమలైన కొత్త రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్యకర్తలు ‘ఫేక్ న్యూస్ చట్టం’ పేరిట విచారణలను ఎదుర్కొంటున్నారు.

బెన్ మబ్రేక్‌ ఆరోగ్యంపై ఆందోళన

టునీషియన్ లీగ్ ఫర్ హ్యూమన్ రైట్స్‌ తెలిపిన ప్రకారం ఆయన నిరాహార దీక్ష విరమించాలని పలుమార్లు ఒప్పించేందుకు ప్రయత్నించినా తనపై జరిగిన అన్యాయాన్ని తొలగించే వరకు దీక్ష కొనసాగిస్తానని మబ్రేక్ స్పష్టం చేశారని ఆ సంస్థ చెబుతోంది. అయితే జైలు అధికారులు మాత్రం ఎవరైనా ఖైదీ ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు తప్పుడు ప్రచారమేనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరబ్ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్‌ (యూకే) జైలులో ఉన్న వ్యక్తుల ప్రాణ రక్షణ, ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. వైద్య పర్యవేక్షణను నిర్లక్ష్యం చేయరాదు అని హెచ్చరిక జారీ చేసింది.

మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నట్లుగా బెన్ మబ్రేక్‌ నిరాహార దీక్ష వ్యక్తిగత నిరసన మాత్రమే కాదు. ఇది దేశంలో న్యాయ వ్యవస్థపై రాజకీయ ప్రభావం పెరిగిందనడానికి నిదర్శనం. టునీషియాలో చట్టపరమైన న్యాయం, ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయనే సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్యునీషియాలో మళ్లీ రాజకీయ ఉద్రిక్తత - Tholi Paluku