
ట్యాంక్ బండ్ శివకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత.. సీఎం రేవంత్ రెడ్డి
హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడిన వందలాది మంది ప్రాణాలను కాపాడి 'రియల్ హీరో'గా గుర్తింపు పొందిన శివకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. శివ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శివ కుటుంబ సభ్యులు సచివాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడమే కాకుండా, శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. నిరుపేద కుటుంబానికి స్థిరమైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కేవలం ఆర్థిక సాయం, ఉద్యోగంతోనే ఆగకుండా శివ కోరిక మేరకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.శివ కుటుంబానికి సొంత ఇల్లు లేదని తెలుసుకున్న సీఎం, వారికి తక్షణమే ఒక డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ విన్నవించగా, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనివల్ల శివ ఇతరులకు ఈత నేర్పిస్తూ గౌరవప్రదంగా జీవించే అవకాశం కలుగుతుంది.
ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడినా, తమను ఎవరూ పట్టించుకోలేదని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి తమ జీవితాల్లో వెలుగులు నింపారని శివ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చేతుల మీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ మేలును ఎన్నటికీ మరువలేమని వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఒక సామాన్యుడు సమాజానికి చేసిన సేవను గుర్తించి, ప్రభుత్వం ఇలాంటి గొప్ప మానవీయతతో స్పందించడం పట్ల నగరవాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
