Let's talk: editor@tmv.in
ట్యాంకర్లు సకాలంలో రాకపోవడంతోనే 'నో స్టాక్' బోర్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ట్యాంకర్లు సకాలంలో రాకపోవడంతోనే 'నో స్టాక్' బోర్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Gaddamidi Naveen
26 మార్చి, 2026

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత వార్తలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై మంత్రి గణాంకాలతో సహా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిల్వలు రాబోయే మూడు నెలల అవసరాలకు సరిపోతాయని ఆయన భరోసా ఇచ్చారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా, చమురు సంస్థలు ఏకంగా 17,898 కిలో లీటర్ల సరఫరా చేశాయి. అంటే అవసరానికి మించి సుమారు 652 కిలో లీటర్ల అదనంగా సరఫరా జరిగింది.పెట్రోల్ బంకులను ఎప్పటికప్పుడు నింపడానికి అదనంగా 1,200 ట్యాంకర్లను రంగంలోకి దించినట్లు మంత్రి తెలిపారు. కొన్ని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించడానికి కారణం కేవలం ట్యాంకర్లు చేరడంలో జరిగిన జాప్యమే తప్ప, ఇంధన కొరత కాదని ఆయన స్పష్టం చేశారు.వదంతుల కారణంగా ఇంధన కొనుగోళ్లు ఒక్కసారిగా 25 శాతం పెరిగినప్పటికీ, సరఫరాను సగటు కంటే 22 శాతం ఎక్కువగా కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు.

అక్రమ నిల్వలపై హెచ్చరిక

పెట్రోల్, డీజిల్‌ను క్యాన్లు, కంటైనర్లలో తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని, ఇది అత్యంత ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. బంకుల వద్ద ఇలాంటి చర్యలకు అనుమతించవద్దని చమురు సంస్థలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

ఎల్పీజీ, వాణిజ్య సిలిండర్ల పరిస్థితి

గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని మంత్రి పేర్కొన్నారు. అయితే, వాణిజ్య సిలిండర్ల విషయంలో కొంత సమస్య ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో అక్రమంగా నిల్వ ఉంచిన 2,952 వాణిజ్య సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న 596 పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఎల్బీ నగర్, బైరామల్‌గూడ వంటి ప్రాంతాల్లో అధికారులు స్వయంగా తనిఖీలు చేశారని, ఎక్కడా బంకులను మూసివేయడానికి అనుమతించడం లేదని చెప్పారు. పౌర సరఫరాలు, పోలీస్, లీగల్ మెట్రాలజీ శాఖలు సమన్వయంతో కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయ‌న వివరించారు.

ఇది కేవలం వదంతుల వల్ల ఏర్పడిన కృత్రిమ రద్దీ మాత్రమే. ప్రజలు శాంతంగా ఉండాలి, వదంతులను నమ్మవద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

ట్యాంకర్లు సకాలంలో రాకపోవడంతోనే 'నో స్టాక్' బోర్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి - Tholi Paluku