Let's talk: editor@tmv.in
టెలికాం రంగంలో కీలక ముందడుగు

టెలికాం రంగంలో కీలక ముందడుగు

Saikiran Y
25 అక్టోబర్, 2025

టెలికాం సాంకేతికతలు మరియు ప్రామాణీకరణ అంశాలలో ఉమ్మడి అధ్యయనాలు, సాంకేతిక సహకారం కోసం టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్‌ (టీఈసీ) - ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్‌ (ఐఐఐటీహెచ్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌ ప్రపంచ ప్రమాణీకరణలో తన పాత్రను బలోపేతం చేయడంతో పాటు టెలికాం రంగంలో స్వదేశీ పరిశోధనలను ప్రోత్సహించనుంది.

ఈ ఒప్పందం కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ భద్రత, స్మార్ట్ సిటీలు, క్వాంటం కమ్యూనికేషన్‌ వంటి భవిష్యత్‌ తరం సాంకేతికతలపై ఉమ్మడి పరిశోధనలకు మార్గం సుగమం చేయనుంది. టెలికాం ప్రామాణీకరణలో కీలకమైన ఐటీయూ-టీ (ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ – టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ సెక్టార్‌) తో భారత్‌ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ భాగస్వామ్యం కృషి చేస్తుంది.

ఐఐఐటీహెచ్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో టీఈసీ డీడీజీ (మొబైల్ సాంకేతికలు) శ్రీ అమిత్‌కుమార్ శ్రీవాస్తవ, ఐఐఐటీహెచ్ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సందీప్‌ శుక్లా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా టీఈసీ సీనియర్ డీడీజీ శ్రీ సయ్యద్ తౌసిఫ్ అబ్బాస్, ఇతర అధికారులు హాజరయ్యారు.

భాగస్వామ్య అంశాలు:

• ఏఐ ఆధారిత నెట్‌వర్క్‌లు: 6జీ వ్యవస్థల కోసం ఏఐ సాంకేతికతలను ఉపయోగించి తెలివైన, ఆటోమేటెడ్ టెలికాం నెట్‌వర్క్‌ల అభివృద్ధి.

• ఎంఎంవేవ్, కాగ్నిటివ్ రేడియో: బీమ్‌ఫార్మింగ్‌, కాగ్నిటివ్ కమ్యూనికేషన్‌ రంగాల్లో సంయుక్త పరిశోధనలు.

• స్మార్ట్ సిటీలు: ఐఓటీ, డిజిటల్ ట్విన్ వంటి సాంకేతికతల్లో సాంకేతిక సహకారం.

• క్వాంటం కమ్యూనికేషన్‌లు: ప్రాతినిధ్య వేదికలలో భారత్‌ స్థితిని బలోపేతం చేసే పరిశోధనలు.

• సైబర్ భద్రత: టెలికాం నెట్‌వర్క్‌ల భద్రత, ధృడత్వాన్ని పెంచే ఉమ్మడి కార్యక్రమాలు.

ఈ భాగస్వామ్యం టెలికాం రంగంలో స్వదేశీ రూపకల్పన, తయారీ సామర్థ్యాలను పెంచి, జాతీయ స్వావలంబన దిశగా ‘ఆత్మనిర్భర్ భారత్‌’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని అధికారులు తెలిపారు. దిగుమతి ఆధారాన్ని తగ్గించే స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేయడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం.

టీఈసీ:

టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్‌ కేంద్ర టెలికమ్యూనికేషన్‌ శాఖకు చెందిన సాంకేతిక విభాగం. ఇది భారతదేశంలో టెలికాం పరికరాలు, నెట్‌వర్క్‌ల ప్రమాణాలు, స్పెసిఫికేషన్లు రూపొందిస్తుంది. నాణ్యత, అనుసంధానం, భద్రతా ప్రమాణాలు నిర్ధారించడంలో టీఈసీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ వేదికలలో భారత్‌ ప్రాతినిధ్యం వహిస్తూ, ఐటీయూ-టీ, 3జీపీపీ వంటి సంస్థలతో సమన్వయం చేస్తోంది.

ఐఐఐటీ హైదరాబాద్:

1998లో ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య (ఎన్‌పీపీపీ) పద్ధతిలో స్థాపించబడిన ఐఐఐటీ–హైదరాబాద్‌ దేశంలో తొలి స్వయం ప్రతిపత్తి ఉన్న ఐఐఐటీ. అధునాతన టెలికమ్యూనికేషన్‌ సాంకేతికతలు, 5జీ-6జీ పరిశోధనలు, కృత్రిమ మేధ, ఐసీటీ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.