Let's talk: editor@tmv.in
టెన్షన్‌లో ఏషియా

టెన్షన్‌లో ఏషియా

FL - TRND
12 అక్టోబర్, 2025

జపాన్‌ మీదుగా చల్లని గాలి వీస్తోంది కానీ.. ఆ గాలిలో ఇప్పుడు చలి కాదు భయం కలిసిపోయింది. అక్టోబర్‌ మొదటి వారంలోనే ఆ దేశం ఒక్కసారిగా కుదేలైంది. సాధారణంగా నవంబర్‌ చివర్లో మొదలయ్యే ఫ్లూ సీజన్‌ ఈసారి ఐదు వారాల ముందుగానే పుట్టుకొచ్చింది. అది చిన్న జలుబు కాదు.. ఒక దేశాన్ని కుదిపేస్తున్న భయానక అల. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 4వేల మందికి పైగా ఆసుపత్రుల్లో చేరారు. ఇది గత వారం కంటే నాలుగు రెట్లు ఎక్కువ. శిశువులు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఆస్పత్రులు మానవ కేకలతో నిండిపోయాయి. ప్రతి వాకిట్లో కూర్చున్న వారు దగ్గుతో వణుకుతున్నారు. ఇదే సమయంలో చాలామందికి మళ్లీ కోవిడ్‌ కాలం గుర్తుకు వస్తోంది. విద్యార్థులు పాఠశాలల గేట్ల దగ్గర నిలబడి తమ స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారా అని ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కనీసం 135 పాఠశాలలు మూసివేశారు. యమగతాలో ఓ ప్రాథమిక పాఠశాల మొత్తం మూసేయాల్సి వచ్చింది. ఎందుకంటే 36మందిలో 22మందికి ఒకేసారి జ్వరం వచ్చింది.

టోక్యో, ఓకినావా, కగోషిమా ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత భయానకం. ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. ఇటు ప్రతి ఒక్కరూ అందరికి దూరంగా నడుస్తున్నారు. ఎందుకంటే ఎవరు వైరస్‌ మోసుకువస్తున్నారో ఎవరికీ తెలియదు. నిజానికి జపాన్‌లో ఇలాంటి సమస్యలు ప్రతీఏడాది సాధారణమే. అయితే ఈసారి వచ్చిన ఫ్లూ భిన్నంగా ఉంది. ప్రపంచం వేగంగా మారుతోందని.. ప్రయాణాలు పెరుగుతున్నాయని.. అందుకే ఈ తరహా వ్యాధులు మరింత వేగంగా రూపాంతరం చెందుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక వైద్యులు పరీక్షించినప్పుడు కొన్ని రోగులలో విచిత్రమైన లక్షణాలు కనిపించాయి. సాధారణ జ్వరం లాగా మొదలై రాత్రి వేళల్లో భ్రాంతులు చూపిస్తూ అవగాహన కోల్పోతున్నారు. కొందరు జ్వరంలోనే తెలియని భాషలో మాట్లాడుతున్నారు. ఆ మాటలు అర్థంకావడంలేదు కానీ విన్నవారికి మాత్రం వణుకు పుడుతోంది.

ప్రజలకు ఇది భయం మాత్రమే కాదు ఆవేదన కూడా. ఎందుకంటే వారు ఇంకా కోవిడ్‌ జ్ఞాపకాల నుంచి బయటపడలేదు. ఇప్పుడు అదే భయాన్ని కొత్త రూపంలో చూస్తున్నారు. ప్రభుత్వం పౌరులను పదేపదే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. మరోవైపు ప్రయాణ నిపుణులు మరో హెచ్చరిక ఇచ్చారు. విదేశీ పర్యాటకులు జపాన్‌కి వస్తున్న వేళ జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పారు. మాస్క్‌ ధరించడం, చేతులు కడుక్కోవడం లాంటివి చేయాల్సిందే. ప్రభుత్వం మాత్రం భయపడొద్దని అంటోంది. కాని యమగతా ప్రాంతంలో ఒక తల్లి చెప్పిన మాట మాత్రం మనసును కలిచివేస్తుంది. ఆమె కొడుకు జ్వరంతో వణుకుతూ నిద్రలో ఎవరో తనను పిలుస్తున్నారని చెప్పాడట. ఉదయం అతని జ్వరం తగ్గింది కానీ అతని కళ్లలో ఆ భయం ఇంకా కనిపిస్తోంది. ఈ రకమైన ఘటనలు దేశమంతా జరుగుతున్నాయి.

ఇటు రాజధాని టోక్యోలో ఆందోళన మరింత పెరిగింది. పాఠశాలలు మూతపడ్డాయి, వీధులు ఖాళీ అయ్యాయి. రాత్రిళ్లు రోడ్ల మీద మాస్కులు ధరించిన ప్రజలు వేగంగా నడుస్తున్నారు, ఎవరూ ఎవరితో మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరి కళ్లలో ఒకే భయం ఉంది. ఇది సాధారణ ఫ్లూనా లేదా మరో రహస్యమా? కొందరు ఇది ప్రకృతి ప్రతీకారమని చెబుతున్నారు. ఇక వైరస్‌ గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యాప్తి చెందుతోందని, భవిష్యత్తులో ఇది సాధారణ వ్యాక్సిన్లకు ప్రతిఘటించే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. మరోవైపు ఇది భయంకరమైన వైరస్‌ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఒక చోట పుట్టిన వైరస్ మరో దేశానికి గంటల్లో చేరుతోంది. ఇదే సమయంలో ఇండియా, సింగపూర్, థాయ్‌ల్యాండ్‌ దేశాల్లో కూడా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని నివేదికలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏషియా అంతటా భయాలు నెలకొన్నాయి. అయితే ఇది కేవలం జపాన్‌కే పరిమితం అవుతుందా లేదా మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తుందా అన్నది ఇప్పటికైతే మిస్టరీగానే ఉంది..!