Let's talk: editor@tmv.in
టెక్స్ట్ టైల్ పార్క్ లో టీ షర్ట్ ల ఉత్పత్తి ప్రారంభం

టెక్స్ట్ టైల్ పార్క్ లో టీ షర్ట్ ల ఉత్పత్తి ప్రారంభం

T Venkata Ramana
12 అక్టోబర్, 2025

వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఉత్పత్తిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. మొదటి యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లకు టీషర్టులు ఎగుమతి చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 2023లో కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశామన్నారు. 11 యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ ఫ్యాక్టరీలకు భూమిపూజ చేశామని గుర్తు చేశారు. 90 శాతం మంది కార్మికులు స్థానిక మహిళలేనని, ఎంపర్‌మెంట్‌కు ఇది నిజమైన చిహ్నమని వెల్లడించారు. అన్ని యూనిట్లు ప్రారంభమైతే వరంగల్‌ ప్రధాన వస్త్ర కేంద్రంగా మారుతుందని వివరించారు. ‘వ్యవసాయం నుంచి ఫ్యాషన్‌’ నినాదంతో టెక్స్‌టైల్‌ పార్కును స్థాపించినట్లు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ వెల్లడించారు.

ఫామ్ టు ఫ్యాషన్

భారతదేశంలోనే అత్యుత్తమ నాణ్యత గల పత్తి ఉత్పత్తి చేయడం మొదలుకుని, 1,350 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను స్థాపించడం వరకు, తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని కేటీఆర్ తెలిపారు. దీనికి వెనక ఉన్న ప్రధాన నినాదం 'ఫామ్ టు ఫ్యాషన్' కావడం విశేషమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పారిశ్రామిక విధానాలు, ముఖ్యంగా టీఎస్‌ఐపాస్ వంటి సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ కారణంగా, తెలంగాణ రాష్ట్రం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ బహుళజాతి కంపెనీల పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పారు. ఈ పెట్టుబడుల ఫలితంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయని, తద్వారా పారిశ్రామిక రంగంలో తెలంగాణ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుందని కేటీఆర్ వెల్లడించారు.

నిర్మాణదశలోనే

అయితే రాష్ట్రంలోని ఇతర టెక్స్‌టైల్ పార్కులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. కొన్ని పార్కులు కాగితాలపైనే ఉండిపోగా, కొన్ని నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరిలోని పొచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌, రంగారెడ్డి జిల్లాలోని వైట్‌ గోల్డ్‌ టెక్స్‌టైల్ పార్క్‌, మెదక్‌ జిల్లాలోని పశమైలారం పార్క్‌లు మొదలైనవి వివిధ దశల్లో నిలిచిపోయాయి.

ఈ పార్కులు ఇంకా తెరుచుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భూమి స్వాధీనం ప్రక్రియలో జాప్యం, పర్యావరణ అనుమతుల లోపం, ప్రైవేట్‌ పెట్టుబడిదారుల వెనుకంజ, నిధుల విడుదలలో ఆలస్యం వంటి అంశాలు ప్రధాన అవరోధాలుగా మారాయి. అంతేకాకుండా మౌలిక వసతులు సిద్ధం కాకపోవడం, నీరు–విద్యుత్‌ సదుపాయాల కొరత,సీఈటీపీ (సామూహిక మలినజల శుద్ధి ప్లాంటు) ఏర్పాటులో జాప్యం కూడా ప్రాజెక్టులను నిలిపేశాయి. మరోవైపు రాజకీయ మార్పులు, పాలనలో విధాన మార్పులు కూడా ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపాయి. కేంద్ర–రాష్ట్ర నిధుల సమన్వయం సరిగా జరగకపోవడంతో పలు టెక్స్‌టైల్ పార్కులు స్థిరమైన రూపం దాల్చలేకపోయాయి. అయినప్పటికీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ ఇప్పుడు ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టడం తెలంగాణ పరిశ్రమలకు ఒక కీలక మైలురాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పరిశ్రమలు విస్తరిస్తే వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.

మూసివేతకు గల కారణాలు

జాతీయ మార్కెట్‌లో బట్టల ధరలు గణనీయంగా పడిపోవడం, తయారీదారులు ఉత్పత్తి చేసిన బట్టకు లాభదాయకమైన ధరలు లభించకపోవడం. ముడి పదార్థాల ఖర్చుల పెరుగుదల నూలు , రసాయనాల ధరలు పెరగడం వలన నేత కార్మికులు తయారీదారులు నష్టాలను భరించలేక ఉత్పత్తిని నిలిపివేశారు. దేశంలో ఎగుమతులు లేకపోవడం కారణంగా భారీ మొత్తంలో బట్ట నిల్వలు పేరుకుపోవడం, దాదాపు కోట్లాది రూపాయల విలువైన పాలిస్టర్ బట్ట నిల్వలు పార్కులో పేరుకుపోయాయి. అంతకుముందు ప్రభుత్వ ఆర్డర్‌లపై దృష్టి పెట్టడం వలన ప్రైవేట్ ఆర్డర్‌లు తగ్గిపోయాయి. ప్రభుత్వ ఆర్డర్‌లు లేనప్పుడు, ప్రైవేట్ ఆర్డర్‌లు తక్కువగా ఉండటం వలన పార్కు నిర్వహణ కష్టమైంది.

అధిక విద్యుత్ ఛార్జీలు

తెలంగాణలో యూనిట్‌కు అధిక విద్యుత్ ఛార్జీలు (సుమారు రూ. 8), ఇతర రాష్ట్రాలతో (ఉదాహరణకు మహారాష్ట్రలో రూ.2) పోలిస్తే తయారీదారులపై భారం పెరగడం. మార్కెటింగ్ సదుపాయాల కొరత, ఉత్పత్తి అయిన బట్టను విక్రయించడానికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం కూడా ఒక కారణం అయ్యింది. దీని కారణంగా సుమారు 1,500 నుండి 2 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి కార్మికులు , తయారీదారులు ప్రభుత్వ సహాయాన్ని కోరారు.