
టెక్సాస్ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు
అమెరికాలోని టెక్సాస్ తీర ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. హ్యూస్టన్‌కు తూర్పున 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ ఆర్థర్‌లోని 'వాలెరో' చమురు శుద్ధి కర్మాగారం (ఆయిల్ రిఫైనరీ)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగలు, నిప్పులు ఎగిసిపడ్డాయి. ఈ శబ్దం దాటికి సమీపంలోని ఇళ్ల కిటికీలు ఊగిపోయాయని, భారీ శబ్దాన్ని విన్నట్లు స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని మేయర్ షార్లెట్ ఎం. మోసెస్ వెల్లడించారు.
ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశం
ప్రమాదం జరిగిన వెంటనే నగర యంత్రాంగం అప్రమత్తమైంది. గాలిలో ప్రమాదకర రసాయనాలు కలిసే అవకాశం ఉండటంతో పశ్చిమ పోర్ట్ ఆర్థర్, సాబిన్ పాస్, ప్లెజర్ ఐలాండ్ వంటి ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఫేస్‌బుక్ ద్వారా ప్రజలను కోరారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఈ 'షెల్టర్-ఇన్-ప్లేస్' హెచ్చరికలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
పారిశ్రామిక హీటర్ వల్లే ప్రమాదం?
షెరీఫ్ జెనా స్టీఫెన్స్ అందించిన సమాచారం ప్రకారం.. రిఫైనరీలోని ఒక పారిశ్రామిక హీటర్ వైఫల్యం చెందడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. టెక్సాస్ పర్యావరణ నాణ్యత కమిషన్ (టీసీఈక్యూ) ఇప్పటికే రంగంలోకి దిగి, ఎయిర్ మానిటరింగ్ పరికరాల ద్వారా గాలి నాణ్యతను పరీక్షిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. వాలెరో వెబ్‌సైట్ ప్రకారం, ఈ ప్లాంట్ ప్రతిరోజూ సుమారు 4,35,000 బారెళ్ల ముడి చమురును శుద్ధి చేయగలదు. ఇక్కడ భారీ మొత్తంలో గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఇంధనాన్ని తయారు చేస్తారు.
ఇంధన ధరలపై ఆందోళన
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అనిశ్చితి నెలకొన్న సమయంలో అమెరికాలోని కీలక రిఫైనరీలో ఈ ప్రమాదం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలు ఈ ఘటన వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రిఫైనరీలో సుమారు 770 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ప్రమాద సమయంలో అందరూ సురక్షితంగా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
