
టీ20 వరల్డ్ కప్ 2026: దక్షిణాఫ్రికా జట్టులోకి రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా జట్టులోని కీలక బ్యాటర్లు టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. వీరి స్థానంలో విధ్వంసక బ్యాటర్లు ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్‌లను జట్టులోకి తీసుకుంటున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా గురువారం ప్రకటించింది.
గాయం నుంచి ఇంకా కోలుకోని డి జోర్జి
గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా టోనీ డి జోర్జి కుడి కాలి కండరాల గాయానికి గురయ్యారు. కోలుకుంటున్నట్లు కనిపించినా, రిహాబిలిటేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంతో అతడు వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌తో పాటు, భారత్-శ్రీలంక వేదికలుగా జరగనున్న ప్రపంచకప్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని బోర్డు స్పష్టం చేసింది. డి జోర్జి జట్టులో లేకపోవడం దక్షిణాఫ్రికా ఓపెనింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఎముక విరగడంతో ఫెరీరా దూరం
మరోవైపు ప్రతిభావంతుడైన మిడిలార్డర్ బ్యాటర్ డోనోవన్ ఫెరీరా దురదృష్టవశాత్తు గాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫెరీరా ఎడమ భుజం ఎముక విరిగింది. దీంతో అతడు కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కీలక ఆటగాళ్ల రాక..
గాయపడిన ఇద్దరి స్థానంలో సెలెక్టర్లు ఇద్దరు స్టార్ ఆటగాళ్లను రంగంలోకి దించారు. ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ర్యాన్ రికెల్టన్, తన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకుంటున్న ట్రిస్టన్ స్టబ్స్‌లను 15 మంది సభ్యుల ప్రపంచకప్ జట్టులోకి చేర్చారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌కు అదనపు బలాన్ని ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మిల్లర్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధం
ప్రధాన ఆటగాళ్ల గాయాల పరంపర ఇక్కడితో ఆగలేదు. స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కూడా కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గత సోమవారం పార్ల్ రాయల్స్ తరఫున ఆడుతున్నప్పుడు అతడికి ఈ గాయమైంది. దీంతో వచ్చే వారం వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు అతను దూరమయ్యాడు. అతని స్థానంలో రూబిన్ హెర్మన్‌ను విండీస్ సిరీస్ కోసం ఎంపిక చేశారు. అయితే మిల్లర్ ప్రపంచకప్‌లో ఆడతాడా లేదా అనేది టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించే ఫిట్‌నెస్ టెస్ట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో జరిగే మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా తన వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది.
దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్ కప్ జట్టు (అంచనా):
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, లుంగీ ఎన్గిడి, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, డేవాల్డ్ బ్రెవిస్, జార్జ్ లిండే, కోర్బిన్ బాష్, క్వేనా మఫాకా, జేసన్ స్మిత్.
