
టీ20 వరల్డ్ కప్: నేడు నమీబియాతో భారత్ పోరు
టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా నేడు తన రెండో గ్రూపు మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై తడబడ్డ బ్యాటర్లకు అరుణ్ జైట్లీ స్టేడియం (గతంలో ఫిరోజ్ షా కోట్లా మైదానం) పిచ్ కలిసొచ్చే అవకాశం ఉంది. పసికూన నమీబియాపై భారీ విజయం సాధించి, ఆదివారం పాకిస్థాన్‌తో జరగబోయే కీలక పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. జట్టు బలాబలాల పరంగా భారత్ కంటే నమీబియా ఎంతో వెనుకబడి ఉండటంతో, ఈ మ్యాచ్ భారత్‌కు ఒక రకంగా ‘ప్రాక్టీస్ సెషన్’ లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అభిషేక్ శర్మకు విశ్రాంతి?
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరోగ్యం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. వైరల్ ఫీవర్, కడుపులో ఇన్ఫెక్షన్‌తో గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఆయన బుధవారమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే, పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ దృష్ట్యా, అభిషేక్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించి రిస్క్ తీసుకోవాలని జట్టు భావించడం లేదు. ఆయన స్థానంలో చాలా కాలంగా ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్న సంజు శాంసన్‌కు తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంజు తిరిగి గాడిలో పడాలని కోరుకుంటున్నాడు.
తిరిగొచ్చిన బుమ్రా.. బలోపేతమైన బౌలింగ్
మరోవైపు జట్టుకు ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. నెట్స్‌లో పూర్తి వేగంతో బౌలింగ్ చేసిన బుమ్రా, నమీబియాపై భారత పేస్ దళానికి నాయకత్వం వహించనున్నారు. అలాగే గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులో చేరడంతో ఆల్రౌండ్ విభాగం బలోపేతమైంది.
నమీబియాకు ‘వరుణ్’ గండం!
నమీబియా బ్యాటర్లకు భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడం హిమాలయ పర్వతాన్ని ఎక్కడం లాంటిదే. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యల పేస్ దాడిని తట్టుకోవడం వారికి సవాలే. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం వారికి మరింత కష్టతరం కానుంది. వరుణ్ కొన్ని కొత్త రకమైన డెలివరీలను ఈ మ్యాచ్‌లో ప్రయోగించే అవకాశం ఉందని సహాయ కోచ్ రియాన్ టెన్ డోస్కటే సంకేతాలిచ్చారు. నమీబియా జట్టులో జేజే స్మిత్ మినహా మిగిలిన బ్యాటర్ల స్ట్రైక్ రేట్ అంత ఆశాజనకంగా లేదు.
అన్నీ అనుకూలంగానే..
ఈ టోర్నీ షెడ్యూలింగ్, వేదికల ఎంపిక భారత్‌కు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ మినహా, లీగ్ దశలో భారత్ తలపడే జట్లన్నీ దాదాపు బలహీనమైనవే. గతంలో భారత ‘ఎ’ జట్టు చేతిలో కూడా నమీబియా 100 పరుగుల లోపే కుప్పకూలింది. సూపర్-8 దశలో కూడా భారత్ తన గ్రూపులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా షెడ్యూల్ రూపకల్పన జరిగింది. ఒక రకంగా సెమీఫైనల్ వరకు టీమ్ ఇండియా ప్రయాణం సాఫీగానే సాగేలా కనిపిస్తోంది.
తుది జట్ల వివరాలు
భారత జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్/అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.
నమీబియా జట్టు (అంచనా):
లారెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్, గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిత్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), డైలాన్ లీచర్, రూబెన్ ట్రంపెల్‌మాన్, విలియం మైబర్గ్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మాక్స్ హెయింగో.
మ్యాచ్ సమయం:
ఇవాళ రాత్రి 7 గంటల నుంచి.
