Let's talk: editor@tmv.in
టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లాదేశ్ దూరమా? ఐసీసీపై ఘాటు వ్యాఖ్యలు

టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లాదేశ్ దూరమా? ఐసీసీపై ఘాటు వ్యాఖ్యలు

Shaik Mohammad Shaffee
21 జనవరి, 2026

వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్ వేదికగా ఆడాలన్న ఐసీసీ షరతులను బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఐసీసీ పెట్టిన నిబంధనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని బంగ్లాదేశ్ యువజన, క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మంగళవారం స్పష్టం చేశారు.

వివాదం ఎక్కడ మొదలైంది?

ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 నుంచి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టును భారత్‌కు పంపేది లేదని ఖరాకండిగా చెప్పేసింది. తమ జట్టు మ్యాచ్‌లను భారత్‌కు బదులుగా శ్రీలంక లేదా ఇతర వేదికలకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది.

భారత్ ఒత్తిడికి ఐసీసీ తలొగ్గుతోందా?

ఆసిఫ్ నజ్రుల్ మీడియాతో మాట్లాడుతూ.. "భారత క్రికెట్ బోర్డు ఒత్తిడికి తలొగ్గి ఐసీసీ మాపై అసంబద్ధమైన షరతులు విధిస్తే, మేము వాటిని అస్సలు ఒప్పుకోము. గతంలో భారత్ పాకిస్థాన్‌లో ఆడటానికి నిరాకరించినప్పుడు ఐసీసీ వేదికలను మార్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా భద్రతా కారణాల దృష్ట్యా వేదిక మార్పు కోరుతున్నాము, ఇందులో తప్పేముంది?" అని ప్రశ్నించారు.

ఐసీసీ డెడ్ లైన్

ఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. తమ జట్టును పంపిస్తారా లేదా అన్న విషయంపై బుధవారం (జనవరి 21) లోపు తుది నిర్ణయం చెప్పాలని బంగ్లాదేశ్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ బంగ్లాదేశ్ వెనక్కి తగ్గితే, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ప్రపంచకప్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకం కానుంది.

షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు ఎక్కడంటే..

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ 'గ్రూప్ సి'లో ఉంది. వారు తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత మరికొన్ని మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉన్నాయి. అయితే భారత్‌లో తమ జట్టుకు భద్రత ఉండదని బంగ్లాదేశ్ వాదిస్తోంది. దీనికి భిన్నంగా, అంతర్జాతీయ భద్రతా నిపుణుల నివేదిక ప్రకారం భారత్‌లో ఎటువంటి ప్రమాదం లేదని ఐసీసీ భరోసా ఇస్తోంది.