
టీ–20 వరల్డ్‌కప్‌లో చివరి యుద్ధం
టీ–20 మెన్స్ వరల్డ్‌కప్‌లో తుది ఘట్టానికి చేరువైంది. ఫైనల్‌లో ఎవరూ గెలుస్తారనే విషయం క్రికెట్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సొంత అభిమానుల మధ్య ఆడుతున్న టీం ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిచి మూడోసారి గెలిచి కప్ ఎగరేసుకుపోవాలని కలలుకంటోంది. అలాగే ఈసారైనా గెలిచి మొదటి టీ–20 ప్రపంచకప్పును ముద్దాడాలని న్యూజిల్యాండ్ భావిస్తోంది. నేటి సాయంత్రం 7 గంటలకు ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఇరుజట్లు తలపడటానికి ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధ వాతావరణంలో ఇండియాలో క్రికెట్ వార్ ఫ్యాన్స్‌ను నిద్రలేకుండా చేస్తోంది. క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇప్పుడు ఈ మ్యాచ్‌పైనే ఉంది. భారత్ చరిత్ర సృష్టిస్తుందా లేదా న్యూజిలాండ్ సంచలనం సృష్టిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ మెన్స్ టీ–20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్‌లో ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ చరిత్ర సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతుండగా, అడ్డుకోవడానికి న్యూజిలాండ్ ప్రయత్నిస్తోంది. 2023 నవంబర్ 19న ఇదే మైదానంలో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్–2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన భారత్ ఆ బాధను ఇంకా మరిచిపోలేదు. అయితే 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇప్పుడు మరోసారి ట్రోఫీని కాపాడుకోవాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
సూర్యకుమార్‌కు చారిత్రాత్మక అవకాశం
ఈ టోర్నీలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు ఇది అత్యంత కీలక మ్యాచ్.
భారత్ గెలిస్తే: టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను మూడు సార్లు గెలిచిన తొలి జట్టు అవుతుంది. టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్న తొలి జట్టుగా కూడా నిలుస్తుంది
బుమ్రా కీలకం
ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు ప్రధాన బలం వేగవంతమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అతని నాలుగు ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ సెమీఫైనల్‌లో 33 బంతుల్లో శతకం సాధించి సంచలనం సృష్టించాడు. అతడిని ప్రారంభంలోనే ఆపగలిగితే భారత్‌కు ప్రయోజనం కలుగుతుంది.
భారత జట్టులో మార్పులు?
ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ టోర్నీలో నిరాశపరిచాడు. అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది సందేహంగా ఉంది. అలాగే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వొచ్చని కూడా చర్చ జరుగుతోంది.
న్యూజిలాండ్ జట్టు ప్రమాదకరమే
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని జట్టు సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి ఆటగాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం కలిగి ఉన్నారు.
అహ్మదాబాద్‌కు భారీగా అభిమానులు – భారీగా విమాన చార్జీలు పెంపు
భారత్–న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరగనున్న టీ–20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్‌కు ప్రయాణించే అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో విమాన చార్జీలు గణనీయంగా పెరిగాయి.ఫైనల్ మ్యాచ్ నరేంద్రమోడీ స్టేడియంలో జరగనుండగా, దేశంలోని పలు నగరాల నుంచి అభిమానులు అహ్మదాబాద్‌కు చేరుకుంటున్నారు. గుజరాత్ టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్ మణీష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ముంబై–అహ్మదాబాద్ మధ్య సాధారణంగా రూ.3,000 ఉండే విమాన టికెట్ ధరలు ప్రస్తుతం రూ.15,000 నుంచి రూ.17,000 వరకు పెరిగాయి. అలాగేఢిల్లీ–అహ్మదాబాద్ విమాన చార్జీలు సుమారు రూ.14,000, బెంగళూరు–అహ్మదాబాద్ విమాన చార్జీలు సుమారు రూ.13,000 వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ
అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ముంబైలోని బాంద్రా టెర్మినస్ నుంచి అహ్మదాబాద్‌కు ఏసీ సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు (ట్రైన్ నం. 09029) మార్చి 8న నడుస్తుంది. ఈ రైలు సూరత్, వడోదర స్టేషన్లలో ఆగుతుంది. అదేవిధంగా, ఢిల్లీ నుంచి అభిమానుల కోసం ప్రత్యేక రైలు (ట్రైన్ నం. 04062)ను కూడా ప్రారంభించారు. ఈ రైలు శనివారం రాత్రి 11.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి, ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సబర్మతి చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు టికెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇండియా–ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు రికార్డు స్థాయిలో ఆన్‌లైన్ వ్యూస్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా జరిగిన ఇండియా–ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్ డిజిటల్ స్ట్రీమింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి 6.52 కోట్ల (65.2 మిలియన్) మంది ప్రేక్షకులు వీక్షించడంతో, ప్రపంచంలో ఏ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనైనా లైవ్ ఈవెంట్‌కు నమోదైన అత్యధిక పీక్ కన్కరెంట్ వ్యూయర్‌షిప్ రికార్డు నమోదైంది.ఈ మ్యాచ్‌కు మొత్తం 619 మిలియన్ వ్యూస్ రావడంతో ఇది ఇప్పటివరకు అత్యధికంగా స్ట్రీమ్ చేసిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. మ్యాచ్‌లో రెండు జట్లూ కలిసి మొత్తం 499 పరుగులు చేయడం అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. ఈ పీక్ వ్యూయర్‌షిప్ 2024 నవంబర్‌లో నమోదైన 65 మిలియన్ కన్కరెంట్ వ్యూయర్స్ అనే గత ప్రపంచ రికార్డును అధిగమించింది.
భారీగా వీక్షించిన మ్యాచ్
టెలివిజన్,డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కలిపి ఈ సెమీఫైనల్ మ్యాచ్‌ను 320 మిలియన్లకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. మొత్తం వీక్షణ సమయం 23 బిలియన్ నిమిషాలకు పైగా నమోదైంది.
