Let's talk: editor@tmv.in
టీ20 ప్రపంచకప్: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే!

టీ20 ప్రపంచకప్: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే!

Shaik Mohammad Shaffee
18 ఫిబ్రవరి, 2026

పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ఇప్పటికే సూపర్‌-8 బెర్తును ఖరారు చేసుకున్న భారత్.. తదుపరి దశలో బలమైన ప్రత్యర్థులతో తలపడనుంది. మంగళవారం పల్లెకెలె వేదికగా ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. జింబాబ్వే సూపర్‌-8కు అర్హత సాధించిన చివరి జట్టుగా నిలిచింది. దీంతో భారత్ ఉన్న గ్రూపులో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేలు చేరాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తన మొదటి సూపర్‌-8 మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత చెన్నైలో జింబాబ్వేతో, కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తలపడి ఈ దశను ముగించనుంది.

పాకిస్థాన్‌పై ఘనవిజయం.. గ్రూప్‌లో అగ్రస్థానం

ఆదివారం కొలంబోలో జరిగిన హైవోల్టేజ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, సగర్వంగా సూపర్‌-8లోకి అడుగుపెట్టింది. ప్రస్తుత గ్రూప్‌-ఏ పట్టికలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ సేన ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్‌లపై సాధించిన విజయాలు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. గతంలో 2022 ప్రపంచకప్‌లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడగా, ఆ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.

నెదర్లాండ్స్ నిష్క్రమణ

మరోవైపు నెదర్లాండ్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్, అమెరికా చేతుల్లో ఎదురైన ఘోర పరాజయాలు స్కాట్ ఎడ్వర్డ్స్ బృందాన్ని రేసు నుంచి తప్పించాయి. నమీబియాపై సాధించిన ఒకే ఒక్క విజయం ఆ జట్టుకు ఊరటనిచ్చింది. ఈ మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ, వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి క్లీన్ స్వీప్‌తో సూపర్‌-8కు వెళ్లాలని భారత్ భావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ వంటి యువ ఆటగాళ్లతో పాటు బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వంటి అనుభవజ్ఞులు ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం.

భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబె, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

టీ20 ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా ఔట్

పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం చోటుచేసుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టి జింబాబ్వే సగర్వంగా సూపర్‌-8 దశకు అర్హత సాధించింది. మంగళవారం పల్లెకెలె వేదికగా ఐర్లాండ్‌, జింబాబ్వేల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. ఈ ఫలితంతో జింబాబ్వే ఐదు పాయింట్లతో గ్రూప్‌-బిలో రెండో స్థానానికి చేరుకుని, సూపర్‌-8కు టికెట్‌ దక్కించుకున్న ఏడో జట్టుగా నిలిచింది. ఇదే సమయంలో కేవలం రెండు పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయి. శుక్రవారం ఒమన్‌తో జరగబోయే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలిచినా.. జింబాబ్వే పాయింట్లను అందుకోవడం అసాధ్యం కావడంతో కంగారూల ప్రస్థానం లీగ్‌ దశలోనే ముగిసింది.

ఈ టోర్నీలో జింబాబ్వే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను చిత్తు చేసిన సికందర్‌ రజా బృందం.. ఆ తర్వాత జరిగిన కీలక పోరులో ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఐర్లాండ్‌తో పాయింట్లు పంచుకోవడంతో మొత్తం 5 పాయింట్లతో నాకౌట్‌కు చేరుకుంది. గ్రూప్‌-బిలో శ్రీలంక జట్టు ఇప్పటికే అగ్రస్థానంలో ఉండి సూపర్‌-8కు చేరుకోగా, ఇప్పుడు జింబాబ్వే రెండో జట్టుగా నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించడం కూడా జింబాబ్వేకు కలిసొచ్చింది. తాజా ఫలితంతో అటు ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్‌ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.